థియేటర్లలో మంచినీళ్లు పెట్టాల్సిందే.. MRP ధరలకే అమ్మాలి

  • Publish Date - May 16, 2019 / 04:34 AM IST

వినోదం కోసం ఇప్పుడు ప్రతీచోట ఉన్న ఏకైక అవకాశం సినిమా. అయితే ఇటీవలికాలంలో సినిమా అంటే కాస్ట్‌లీ అయిపోయింది. సినిమాకు వెళ్లాలంటే జేబులు ఖాళీ అయ్యే పరిస్థితి. టిక్కెట్లనే అధిక రేట్లకు అమ్ముతుంటే.. మరోవైపు సినిమా థియేటర్లలో ఎమ్‌ఆర్‌పీ రేట్ల అమలు విషయంలో థియేటర్లలో నిబంధనలకు విరుద్ధంగా భారీ రేట్లకు అమ్ముతున్నారు.
ఇదిలా ఉంటే దేశవ్యాప్తంగా థియేటర్లలో వాటర్ బాటిళ్ల అమ్మకంపై స్పష్టమైన నిబంధనలు విధించింది జాతీయ వినియోగదారుల ఇబ్బందుల పరిష్కార కమీషన్(National Consumer Disputes Redressal Commission) (NCDRC).

మల్టిప్లెక్స్‌లలోనూ, థియేటర్లలోనూ వాటర్ బాటిళ్లను బయటి ధరలకే అమ్మాలంటూ ఆదేశాలను జారీ చేసింది. ధరలను అతిక్రమిస్తే చర్యలు తప్పవని హెచ్చరించింది. ఎమ్‌ఆర్‌పీ ధరలకంటే ఎక్కువకు అమ్మితే వాటిని సీజ్ చేయాలని అధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. అయితే హైదరాబాద్‌కు చెందిన విజయ్ గోపాల్ అనే సామాజిక కార్యకర్త ఇందులో అనేక విషయాలను ప్రస్తావించారు.

సామాన్యులకు అందుబాటులో లేని ధరలలో ఉండే కంపెనీ వాటర్‌ బాటిళ్లను ఓన్ బ్రాండ్ వాటర్ బాటిళ్లను థియేటర్లలో పెడుతున్నారని, థియేటర్లలో అందుబాటులో ఉంచాల్సిన మంచి నీళ్లను అందుబాటులో ఉంచట్లేదని తన కంప్లైంట్‌లో ప్రస్తావించారు. కొన్ని థియేటర్లలో మంచినీటినీ టాయిలెట్లకు దగ్గరగాను.. పరిశుభ్రంగానూ లేకుండా పెట్టి తాగడానికి ఇబ్బంది పడేలా కావాలని చేస్తున్నారంటూ తన కంప్లైంట్‌లో వెల్లడించారు. 

ఈ విషయాలపై స్పందించిన NCDRC నీటిని అందుబాటులో ఉంచాలని, అలా ఉంచకుండా ఉండేందుకు ప్రయత్నించే థియేటర్లపై రైడ్ చేసి చర్యలను తీసుకోవాలని ఆదేశించింది.