చినుకుపడితే చెరువుల్లా సిటీలో రోడ్లు.. 60 ఏళ్ల క్రితం ఎలా ఉండేదంటే?

  • Publish Date - October 14, 2020 / 08:49 PM IST

ముంబై, ఢిల్లీ, చెన్నై నగరాలతో పాటు హైదరాబాద్‌లోనూ వరదనీరు బయటకు పోయేందుకు సరైన ఏర్పాట్లు లేవు. ఈ విషయం చాలా సర్వేల్లో తేలింది. అందుకే చినుకు పడితే సిటీలోని రోడ్లన్నీ చెరువులుగా మారుతున్నాయి. కాలనీలు నీట మునుగుతున్నాయి.

60 ఏళ్ల క్రితం నిజాం పాలకులు హైదరాబాద్‌లో రెయిన్​వాటర్​ మేనేజ్​మెంట్‌ని చాలా నీట్‌గా చేపట్టారు. నీళ్లు చెరువుల్లోకి, కుంటల్లోకి పోయేలా రోడ్ల పక్కన డ్రెయిన్లు కట్టించారు.

ఆ తర్వాత నగరం వేగంగా అభివృద్ధి చెందింది. రోడ్లు విశాలంగా విస్తరించాయి. దీంతో డ్రెయిన్‍ వాటర్‍ లైన్లు కనిపించకుండా పోయాయి. అభివృద్ధి పేరుతో అపార్ట్​మెంట్లు, కాంప్లెక్స్‌లు, మల్టీప్లెక్స్‌లు వెలిశాయి.



అందులోనైనా వాటర్‍ హార్వెస్టింగ్‍ పాయింట్లు కనిపిస్తాయా అంటే అదీ లేదు. రోడ్ల పక్కన కనీసం ఇంకుడు గుంతలు తవ్వించే ప్లాన్ కూడా చేపట్టలేదు. ఈ కారణంగా చినుకుపడితే వణికే పరిస్థితి వచ్చింది.

నగరంలో ఇంకుడు గుంతలు, డ్రెయిన్లు ఎక్కడా కనిపించవు. ఒకట్రెండు చోట్ల ఉన్నా మెయింటనెన్స్ లేకపోవడంతో లక్ష్యం నీరుగారుతోంది.

ఒకప్పుడు హైదరాబాద్‍ పరిసరాల్లో ఎన్నో చెరువులు ఉండేవి. అవి చాలా వరకు కబ్జాకి గురయ్యాయి. కొన్ని చోట్ల కంపెనీలు, మరికొన్ని చోట్ల ఇళ్ల భవనాలు నిర్మించారు.

దీంతో చెరువులు నిండినప్పుడల్లా అపార్ట్​మెంట్లు, కాలనీలు వాన నీటితో వాటర్​బాడీలను గుర్తుకు తెస్తున్నాయి.

కొత్త కాలనీల్లో డ్రైనేజీలన్నీ మూసీలోకే..
ఒకప్పుడు మూసీలో మంచి నీళ్లు పారేవి. ఇప్పుడా నది పేరు వింటేనే ముక్కు మూసుకోవాల్సిన పరిస్థితి. పాత బస్తీతోపాటు కొత్త కాలనీల్లోని డ్రైనేజీ లైన్లన్నీ మూసీలోకే వెళ్తున్నాయి.

హైదరాబాద్‌లో గత 111ఏళ్లలో ఆరుసార్లు మాత్రమే భారీ వర్షం వచ్చింది. అధికార యంత్రాంగం అప్పటికప్పుడు హడావుడి చేసి చేతులు దులుపుకుంది.

అంతేతప్ప దీర్ఘకాలిక వ్యూహాలతో ముందుచూపుతో వ్యవహరించలేదు. నగరంలోని డ్రైనేజీ సమస్యలో సీవరేజ్​ సిస్టమ్​పెద్దది. నార్త్​ జోన్​తో పోల్చితే ఇబ్బందులు ఉన్న ఏరియాలు సౌత్ జోన్​లోనే ఎక్కువ.

గతంలో ఏర్పాటుచేసిన డ్రైనేజీ వ్యవస్థ 5 లక్షల జనాభాకు మాత్రమే సరిపోతుంది. ఇప్పుడా సంఖ్య కోటికి చేరింది. అందుకే వానకష్టాలు జనాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి.



నీటి కాలువల పక్కన స్థలాలు కబ్జా
నిజానికి వరద నీటి వ్యవస్థ, సీవరేజ్ వాటర్ సిస్టం వేర్వేరుగా ఉండాలి. ప్రస్తుతం రెండూ ఒకే వ్యవస్థగా మారాయి. దీంతో కెపాసిటీ సరిపోవడం లేదు. వరద నీటి కాలువల పక్కన ఉన్న స్థలాలు చాలా వరకూ కబ్జా అయ్యాయి.

ఒకప్పుడు ఈ సిస్టమ్​ కోసం చాలా ఓపెన్ ప్లేస్ ఉండేది. ఆ స్థలంలో వర్షం నీరు ఇంకేది. ఇప్పుడా పరిస్థితి లేదు. విశ్వ నగరంలో మురుగు నీరు, వర్షపు నీరు విడివిడిగా ప్రవహించేలా ఏర్పాట్లు ఉండాలి.



పెరిగే పాపులేషన్​కి అనుగుణంగా డ్రైనేజీ వ్యవస్థను పటిష్టంగా నిర్మించాలి. కానీ.. ఇవన్నీ లేకుండా ఎవరి అవసరాలకు తగ్గట్గు వాళ్లు.. ఇళ్లు కట్టు కోవడంతో నగరం నరకంలా మారింది. డ్రైనేజీలు, చెరువులు, కుంటలు అనే తేడా లేకుండా స్వాహా చేశారు.

చిన్నపాటి వానకే విపరీతంగా ట్రాఫిక్‌ జామ్‌ అవుతోంది. నీళ్లు రోడ్లపై నిలవటంతో గుంతలు ఏర్పడుతున్నాయి. దీంతో నగరం నిలువునా జలమయం అవుతోంది.



ఎత్తయిన ప్రాంతాల నుంచి నీళ్లు ఎటువెళ్లాలి?
ఒకప్పుడు హైదరాబాద్‌లో వెయ్యి చెరువులు ఉండేవి. ఇప్పుడు చూద్దామన్నా ఒక్కటి కనిపించదు. రామంతాపూర్‌, బోయిన్‌పల్లి, రాయదుర్గంలాంటి చెరువుల చుట్టూ ఇళ్లు నిర్మించారు.

బంజారాహిల్స్‌, జూబ్లీహిల్స్​, హైటెక్‌ సిటీ లాంటి ఎత్తైన ప్రాంతాల నుంచి వచ్చే నీళ్లు ఎక్కడికి పోవాలి..? వాస్తవానికి అక్కడే ఉన్న దుర్గం చెరువులోకి వెళ్లాలి.

కానీ ఇప్పుడా చెరువులోకి నీళ్లు పోయే పరిస్థితి లేదు. లోతట్టు ప్రాంతాల్లో కట్టిన ఇళ్లలోకి నీరు చేరుతోంది. నేలను సిమెంట్‌తో ప్లాస్టరింగ్​చేయడంతో నీళ్లు ఇంకే ఛాన్స్​లేకుండాపోయింది.

ఇలాంటి పరిస్థితి చాలాచోట్ల ఉంది. అందుకే లోతట్టు ప్రాంతాలు జలమయం కావడం సాధారణంగా మారిపోయింది.



ఎక్కడా కనిపించని సిటీ, టౌన్‌, కంట్రీ ప్లానింగ్ :
ఒక్క వర్షానికే నగరం నరకప్రాయంగా మారడానికి ప్లానింగ్‌ లోపమే కారణం. సిటీ ప్లానింగ్‌, టౌన్‌ప్లానింగ్‌, శివారు గ్రామాల కోసం కంట్రీప్లానింగ్‌.. ఇవేవీ కనిపించడం లేదు. ఎప్పుడో పది లక్షల జనాభా కోసం ఉద్దేశించిన డ్రైనేజీ సిస్టమ్‌తోనే ఇప్పటికీ నెట్టుకొస్తున్నారు.

ఫ్లడ్‌ మేనేజ్‌మెంట్‌ పాలసీ, డ్రైనేజీ పాలసీ ఎక్కడున్నయ్‌..? వానలు, వరదలతో సిటీ ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి కిర్లోస్కర్‌ కమిటీ ఇచ్చిన రిపోర్ట్‌ మీద ఇప్పటి వరకు చర్యల్లేవ్.



భారీ వర్షాలు పడినప్పుడు నీళ్లు పోవడానికి ఏర్పాట్లు ఉండాలి. రోడ్ల నిర్మాణం పూర్తి అన్‌ సైంటిఫిక్‌గా ఉంటోంది. ఎక్కడ సమతలంగా ఉండాలి..? ఎక్కడ పల్లం ఉండాలి..? నీళ్లు ఎటు నుంచి ఎటుపోవాలనే ప్లానింగ్‌ లేదు. దీంతో వానొస్తే వరద ఇళ్లల్లోకి ప్రవహిస్తోంది.

భూకంపాలు, వరదలు లాంటి ప్రకృతి ప్రమాదాలు జరగని ఎత్తైన ప్రాంతంలో హైదరాబాద్‌ ఉంది. ఇలాంటి సేఫ్​సిటీలో విపత్తులను మనకు మనమే కొని తెచ్చుకుంటున్నాం.