హైదరాబాద్ : సీఎల్పీ నేతగా కొత్త ఛార్జ్ తీసుకున్న భట్టి విక్రమార్కకు అనేక సవాళ్లు స్వాగతం పలుకుతున్నాయి. కష్టాల్లో ఉన్న కాంగ్రెస్‌ను భట్టి సారథ్యం తీరం దాటిస్తుందా ? పట్టు వదలని విక్రమార్కుడిలా పదవి దక్కించుకున్న ఆయన.. పార్టీ వాయిస్ వినిపించడంలో సక్సెస్ అవుతారా ? ఇంతకు మల్లు ముందున్న సవాళ్లేంటి ?
మల్లు భట్టి విక్రమార్క. సహచరుల నుండి తీవ్ర పోటీ ఎదుర్కొని సీఎల్పీ లీడర్ పదవి దక్కించుకున్నారు. ఎమ్మెల్యేగా హ్యాట్రిక్ సాధించిన భట్టి విక్రమార్కకు.. గతంలో ఎమ్మెల్సీ, అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్, చీఫ్ విప్ పదవులు నిర్వహించిన అనుభవం ఉంది.
19 మంది సభ్యులు…
అసెంబ్లీ ఎన్నికల్లో ఊహించని రీతిలో ఓటమి చెందిన కాంగ్రెస్ డీలా పడింది. గతంలో ఎన్నడూ లేనివిధంగా 19 మంది సభ్యులకే పరిమితమైంది. తనతో పాటు సీఎల్పీ పదవి ఆశించిన సహచరులు భట్టికి సహకరిస్తారా ? అన్నది ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. తమకు కాకుండా భట్టికి సీఎల్పీ పదవి దక్కినందుకు ఉత్తమ్, కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, శ్రీధర్‌బాబులు అసంతృప్తిగా ఉన్నట్లు సమాచారం. మరి వీరి నుండి భట్టి విక్రమార్కకు ఎంతమేరకు సహకరం లభిస్తుందో చూడాలి.
ఆపరేషన్ ఆకర్ష్‌కు చెక్ పెడుతారా ?
ప్రధానంగా భట్టి విక్రమార్కకు ముందున్న అసలైన సవాల్ గులాబీ ఆకర్ష్. ఇప్పటికే 10 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు టీఆర్‌ఎస్‌తో టచ్‌లో ఉన్నారని… త్వరలోనే వారంతా గులాబీ గూటికి చేరుతారని ప్రచారం జరుగుతోంది. టీఆర్‌ఎస్ ఆపరేషన్ ఆకర్ష్‌కు భట్టి ఎలా చెక్ పెడతారనేది ఆసక్తి రేపుతోంది. ఓవైపు ఇదంతా టీఆర్‌ఎస్ మైండ్‌గేమ్ అని కాంగ్రెస్ కొట్టి పారేస్తున్నా… ఉన్న ఎమ్మెల్యేలందరినీ భట్టి ఎలా ముందుకు తీసుకెళ్లారనేది పార్టీలోనే కాకుండా.. అన్ని రాజకీయ పార్టీల్లో చర్చ జరుగుతోంది. ఐదేళ్లలో ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూనే.. పార్టీ కేడర్‌కు బూస్ట్ ఇవ్వాల్సిన పరిస్థితి ఉంది. మరి ఈ బాధ్యతల్లో భట్టి విక్రమార్క ఎంతవరకు సక్సెస్ అవుతారో.. చూడాలి.