తెలంగాణలోని గ్రామ పంచాయతీ కార్మికులకు కేసీఆర్ ప్రభుత్వం శుభవార్త వినిపించింది. గ్రామ కార్మికుల జీతాలు పెంచింది. రూ.8వేల 500 కి పెంచూతూ కేసీఆర్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు పంచాయతీరాజ్‌శాఖ ముఖ్య కార్యదర్శి వికాస్ రాజ్ సోమవారం(అక్టోబర్ 14,2019) ఉత్తర్వులు జారీ చేశారు. గతంలో గ్రామ పంచాయతీల్లో పనిచేసే పారిశుధ్య, ఇతర కార్మికులకు ఒక్కో పంచాయతీలో ఒక్కో విధంగా జీతం ఉండేది. కొన్ని చోట్ల చాలా తక్కువ వేతనం ఉంది. ఇకపై అన్ని పంచాయతీల్లోనూ ఒకే రకమైన జీతాలు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. పెంచిన జీతాలకు అనుగుణంగా ప్రభుత్వం నిధులను విడుదల చేస్తుందని ఉత్తర్వుల్లో తెలిపారు.
శాలరీ పెంచుతూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పంచాయతీ కార్మికుల్లో ఆనందం నింపింది.జీతాలు పెంచడంతో కార్మికుల కుటుంబాల్లో దీపావళి పండగ ముందే వచ్చినట్లయింది. కేసీఆర్ నిర్ణయంపై కార్మికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. జీతాలు పెంచినందుకు ఆయనకు కృతజ్ఞతలు చెబుతున్నారు.