తెలంగాణలో ఆర్టీసీ కార్మికుల సమ్మెపై తీవ్ర ఆగ్రహంగా ఉన్న సీఎం కేసీఆర్… మరిన్ని నిర్ణయాలు తీసుకునే దిశగా అడుగులు వేస్తున్నారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తీసుకోవాల్సిన చర్యలపై కసరత్తు చేస్తున్న ప్రభుత్వం… మంత్రులు, కలెక్టర్ల సమావేశంలో మరిన్ని కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. 2019, అక్టోబర్ 10వ తేదీ గురువారం ఉదయం 11 గంటలకు ప్రగతి భవన్‌లో మంత్రులు, కలెక్టర్లు, జిల్లా పంచాయతీ అధికారులతో ముఖ్యమంత్రి భేటీ కానున్నారు. 5వ తేదీ నుంచి ఆర్టీసి కార్మికులు సమ్మె చేపట్టిన అనంతరం ప్రభుత్వం ప్రత్యామ్నాయ రవాణా వ్యవస్థపై దృష్టి సారించింది.
ఆర్టీసీని మరింత బలోపేతం చేయడంతో పాటు లాభాల బాట పట్టించేందుకు అనుసరించాల్సిన వ్యూహాలతో ఉన్నతాధికారులతో పలుమార్లు కేసీఆర్ సమీక్షలు నిర్వహించారు. 13వ తేదీ నుంచి పాఠశాలలు పున:ప్రారంభం కానుండటంతో… ఆ లోపే ప్రత్యామ్నాయ రవాణా వ్యవస్థను గాడిన పెట్టాలని దిశానిర్దేశం చేయనున్నట్లు తెలుస్తోంది. మరోవైపు నూతన రెవెన్యూ చట్టాన్ని పకడ్బందీగా తేవాలని కసరత్తు చేస్తున్న ప్రభుత్వం… కొత్త రెవెన్యూ చట్టంపై కలెక్టర్లతో గతంలోనే చర్చించింది. క్షేత్రస్థాయిలో ఇబ్బందులను పరిశీలించి నివేదికను సమర్పించాలని కేసీఆర్ అప్పట్లో ఆదేశించారు.
అందుకు అనుగుణంగా… కొత్త రెవెన్యూ చట్టాన్ని మరింత పక్కాగా రూపొందించేందుకు ప్రభుత్వం రెడీ అవుతోంది. గ్రామ కార్యాచరణను ప్రభుత్వం రెండు విడతలుగా చేపట్టాలని నిర్ణయం తీసుకుంది. ఇటీవలే తొలి విడత పూర్తి కూడా అయింది. రెండో విడత గ్రామ కార్యాచరణ ఎప్పట్నుంచి చేపట్టాలి? తొలి విడతలో గ్రామాల నుంచి వచ్చిన సమస్యలను పరిష్కరించుకునేందుకు తీసుకోవాల్సిన గడువుపై సీఎం దిశానిర్దేశం చేయనున్నారు. గత మంత్రివర్గ సమావేశంలో వివిధ అంశాలపై 8 కమిటీలను సీఎం కేసీఆర్ ఏర్పాటు చేశారు. ఈ కమిటీలు… ఆయా రంగాల్లో ప్రగతి సాధించిన రాష్ట్రాల్లో పర్యటించి ప్రభుత్వానికి నివేదికలు సమర్పించాల్సి ఉంటుంది. దీనిపై మంత్రులకు కేసీఆర్ సూచనలు ఇవ్వనున్నారు.
Read More : ఆర్టీసీ సమ్మె ఆరో రోజు : మరోసారి అఖిలపక్ష నేతలతో జేఏసీ మీటింగ్