తెలంగాణ మంత్రివర్గ విస్తరణ తేదీ ఖరారు అయింది. ఫిభ్రవరి 19న ముహూర్తం పెట్టారు సీఎం కేసీఆర్. ఆ రోజు ఉదయం 11.30గంటలకు రాజ్ భవన్ లో ఈ కార్యక్రమం ఉండనుంది. మాఘశుద్ధపౌర్ణమి మంచి రోజు కూడా. కేబినెట్ లో 8 మందికి చోటు దక్కనున్నట్లు సమాచారం. పేర్లు మాత్రం వెల్లడి కాలేదు. ఎవరెవరు ఆ రోజు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు అనేది ఆసక్తిగా మారింది. ఇప్పటికే చాలా మంది ఆశావహులు బెర్తుల కోసం ఉబలాటపడుతున్నారు.
గత కేబినెట్ లో కీలక పదవుల్లో ఉన్న కేటీఆర్, హరీశ్ రావుపై అందరి ఆసక్తి నెలకొంది. కేటీఆర్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా బాధ్యతలు స్వీకరించారు. ఇప్పుడు మంత్రివర్గంలోకి తీసుకుంటారా లేక పార్టీ వరకే పరిమితం చేస్తారా అనేది చర్చనీయాంశం అయ్యింది. పార్లమెంట్ ఎన్నికలు కూడా రాబోతున్నాయి. ఈ సమయంలో కేటీఆర్ కు రాష్ట్ర మంత్రి వర్గంలో చోటు దక్కకపోవచ్చనే ప్రచారం కూడా లేకపోలేదు. మరొకరు హరీశ్ రావు. పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేస్తారనే ప్రచారం కూడా జరుగుతుంది. దీనికి పార్టీ ఇంత వరకు క్లారిటీ ఇవ్వలేదు. అదే విధంగా హరీశ్ రావు కూడా స్పందించలేదు.
ఈ రెండు కీలక ప్రశ్నలకు.. 19వ తేదీ జరిగే కేబినెట్ విస్తరణలో సమాధానం దొరకనుంది. అదేవిధంగా ఎమ్మెల్సీ ఎన్నికలు కూడా ఉన్నాయి. ఆశావహుల్లో కొందరికి ఎమ్మెల్సీలు ఇచ్చి.. మిగతావారిని కేబినెట్ లోకి తీసుకోనున్నారనేది టీఆర్ఎస్ పార్టీ వర్గాల సమాచారం.