విన్నపాలు వినవలె : మోడీతో సీఎం కేసీఆర్

  • Publish Date - October 4, 2019 / 11:29 AM IST

భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీని తెలంగాణ సీఎం కేసీఆర్..కలిశారు. రెండోసారి ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టిన మోడీకి..అభినందనలు తెలిపారు. అక్టోబర్ 04వ తేదీ శుక్రవారం ఢిల్లీలో కేంద్ర మంత్రులతో కేసీఆర్ భేటీలు నిర్వహిస్తున్నారు. సాయంత్రం 4.30గంటలకు ప్రధాని నివాసానికి చేరుకున్న సీఎం కేసీఆర్..మోడీతో భేటీ అయ్యారు. పలు కీలక అంశాలపై వీరిద్దరూ చర్చించారు. 

కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధులను రాబట్టడమే లక్ష్యంగా హస్తిన బాట పట్టారు కేసీఆర్‌. రాష్ట్రానికి ఆర్ధిక సహకారం, గోదావరి, కృష్ణా నదుల అనుసంధానంతో పాటు విభజన అంశాలపై చర్చించారు. మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ ప్రాజెక్టులకు నీతి ఆయోగ్ ప్రతిపాదించిన రూ.19వేల కోట్ల సాయాన్ని మంజూరు చేయాలని కూడా ప్రధానిని కోరినట్లు సమాచారం.

బయ్యారంలో ఉక్కు పరిశ్రమ, కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ నెలకొల్పాలని, కేంద్ర పథకాలకు ఇవ్వాల్సిన నిధులను విడుదల చేయాలని ఈ సమావేశంలో ప్రధానిని కోరనున్నారు సీఎం కేసీఆర్. కొత్తగా ములుగు, నారాయణపేట జిల్లాలను ఏర్పాటు చేసినందున.. జోనల్ వ్యవస్థలో మార్పులు చేయాలని కోరినట్లు సమాచారం. ఇరు రాష్ట్రాల మధ్య జరిగిన చర్చల సారాంశాన్ని ఆయన దృష్టికి తీసుకొచ్చారు.

గోదావరి, కృష్ణా అనుసంధానం జరిగితే..ఇరు రాష్ట్రాల రైతులకు ఎంతో లబ్ధి చేకూరుతుందని తెలియచేసినట్లు సమాచారం. ఈ క్రమంలో ప్రాజెక్టుకు ఆర్థిక సహాయాన్ని అందించాలని ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్రంలో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు పరిస్థితిని వివరించారు. పెండింగ్ లో ఉన్న హామీలు అమలు చేయాలని ప్రధాన మంత్రిని సీఎం కేసీఆర్ కోరారు. 

మోడీని కేసీఆర్‌ 2018 డిసెంబరులో చివరి సారిగా కలిశారు. మోడీ రెండోసారి ప్రధానమంత్రి అయిన తర్వాత ఇప్పటి వరకు కలువలేదు. నీతి ఆయోగ్‌ ఏర్పాటు చేసిన సీఎంల సమావేశానికి, నక్సల్‌ సమస్యపై హోంమంత్రి అమిత్‌ షా ఏర్పాటు చేసిన సమావేశానికీ కేసీఆర్‌ వెళ్లలేదు. రాష్ట్రంలో బీజేపీ- టీఆర్‌ఎస్‌ ఉప్పు-నిప్పుగా మారిన దశలో పది నెలల తర్వాత  కేసీఆర్‌ ప్రధాని మోడీని కలుస్తుండడంతో వీరి భేటీ రాజకీయ ప్రాధాన్యం సంతరించుకుంది.