ఏం తేలుస్తారో : ఆర్టీసీ సమ్మెపై సీఎం కీలక సమీక్ష

  • Publish Date - October 6, 2019 / 07:29 AM IST

తెలంగాణ ఆర్టీసీ కార్మికులు చేపడుతున్న సమ్మెపై ప్రభుత్వం ఓ కీలక నిర్ణయం తీసుకోనుంది. ప్రగతి భవన్‌లో అక్టోబర్ 06వ తేదీ మధ్యాహ్నం ఒంటి గంటకు సీఎం కేసీఆర్ అధ్యక్షతన ఈ మీటింగ్ ప్రారంభమైంది. ఉన్నతస్థాయి సమావేశానికి మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్.కె.జోషి, డీజీపీ మహేందర్ రెడ్డి, రవాణా శాఖ, ఆర్టీసీ ఉన్నతాధికారులు హాజరయ్యారు. సమావేశంలో ఆర్టీసీ సమ్మె, ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై చర్చించనున్నారు. కార్మికుల డిమాండ్లపై చర్చించనున్నట్లు తెలుస్తోంది. ఈ సమావేశంలో ఓ కీలక నిర్ణయం వెలువడే అవకాశం ఉందని తెలుస్తోంది. 

అక్టోబర్ 05వ తేదీ నుంచి ఆర్టీసీ కార్మికులు సమ్మెలోకి వెళ్లిన సంగతి తెలిసిందే. సమ్మెను నివారించడానికి ప్రభుత్వం, కార్మిక సంఘాలతో చర్చలు జరిపింది. కానీ ఈ చర్చలు విఫలమయ్యాయి. దీంతో సమ్మెలోకి వెళ్లారు. అయితే..దసరా పండుగ నేపథ్యంలో సమ్మె చేపట్టడడంపై సర్కార్ సీరియస్‌గా ఉంది. విధుల్లోకి హాజరు కావాలని, లేనిపక్షంలో వారిని ఉద్యోగులుగా పరిగణించమన్న హెచ్చరికలను కూడా బేఖాతర్ చేశారు కార్మికులు. దీంతో ఏదో ఒకటి నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వ యోచిస్తోందని తెలుస్తోంది. 

మరోవైపు దసరా పండుగ ఉండడంతో సొంతూళ్లకు వెళ్లడానికి ప్రయాణీకులు అష్టకష్టాలు పడుతున్నారు. ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసినా..అవి చాలనంత లేవు. దీంతో ప్యాసింజర్లు..ప్రైవేటు వాహనాలను ఆశ్రయిస్తున్నారు. ఇదే అదనుగా ధరలను అమాంతం పెంచేశారు. ఛార్జీలను చూసి..ప్రయాణీకులు తెల్లమొహం వేస్తున్నారు. ఒకేసారి ఇంతగా పెంచడం దారుణమంటున్నారు. అయినా..సొంతూళ్లకు వెళ్లి పండుగ జరుపుకోవాలనే ఉద్దేశ్యంతో వందలకు వందలు చెల్లించి ప్రయాణం చేస్తున్నారు. సమస్యను పరిష్కరించే విధంగా ప్రభుత్వం, ఆర్టీసీ కార్మిక సంఘాలు ప్రయత్నించాలని కోరుతున్నారు. మరి సీఎం కేసీఆర్ జరిపే ఉన్నతస్థాయి సమీక్షా సమావేశంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో చూడాలి. 
Read More : టికెట్ టికెట్ ప్లీజ్ : ఆర్టీసీలో చెల్లని బస్ పాస్‌లు!