ఆర్టీసీ చరిత్రలో నూతన అధ్యాయం : సమ్మెపై సీఎం కేసీఆర్ సంచలన నిర్ణయం

  • Publish Date - October 6, 2019 / 03:26 PM IST

ఆర్టీసీ చరిత్రలో నూతన అధ్యాయం ప్రారంభించబోతున్నట్లు సీఎం కేసీఆర్ ప్రకటించారు. ఆర్టీసీ మనుగడ కొనసాగాలంటే..కొన్ని చర్యలు తప్పవని హెచ్చరించారు. కార్మికులు చేసింది తీవ్రమైన తప్పిదమన్నారు. ఇక నుంచి కార్మికులతో ఎలాంటి రాజీ ఉండదని..చర్చల ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు.

అక్టోబర్ 05వ తేదీ నుంచి ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మెపై ప్రగతి భవన్‌లో అక్టోబర్ 06వ తేదీ మధ్యాహ్నం సీఎం కేసీఆర్ ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో సంచలన నిర్ణయాలు తీసుకున్నారు. నష్టాల బాటలో ఉన్న సంస్థను లాభాల బాటలోకి తెచ్చే విధానాలపై సుదీర్ఘంగా చర్చించింది. 

ఆర్టీసీని విలీనం చేసే ప్రసక్తే లేదని సీఎం కేసీఆర్ ప్రకటించారు. గడువులోగా హాజరుకాని వారిని విధుల్లోకి తీసుకొనేది లేదని కఠిన నిర్ణయం తీసుకున్నారు. దసరా సమయంలో సమ్మెకు దిగిన వారితో రాజీ ఉండదని స్పష్టం చేశారు. 

సమ్మె అనంతరం కేవలం 12 వందల మంది ఉద్యోగులు హాజరయ్యారని నివేదికలు ఇచ్చారు అధికారులు. సగం బస్సులను ప్రైవేటు వారికి అప్పగించాలని, మిగతా ఆర్టీసీ బస్సులతో నిర్వహించాలని, మొత్తంగా 2 వేల 500 అద్దె బస్సులు నడుపాలని ప్రభుత్వం నిర్ణయించింది.

కొద్ది రోజుల్లోనే కొత్త సిబ్బందిని నియమిస్తామని సంచలన ప్రకటన చేశారు. కొత్తగా చేరే ఉద్యోగులకు పలు కండీషన్స్ పెడుతున్నట్లు సమాచారం. 15 రోజుల్లో ఆర్టీసీకి పూర్వస్థితి వస్తుందని అంచనా వేస్తోంది ప్రభుత్వం.