ఆర్టీసీ సమ్మె ఎఫెక్ట్ : MMTS రైళ్లకు ఫుల్ డిమాండ్

  • Publish Date - November 4, 2019 / 03:21 AM IST

ఆర్టీసీ ఉద్యోగులు, కార్మికుల సమ్మె ప్రారంభమై నెల రోజులు కావస్తోంది. ప్రైవేటు వారితో బస్సులు తిప్పుతున్నా..అవి ఏమాత్రం సరిపోవడం లేదు. దీంతో నగర వాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రధానంగా ఉద్యోగస్తులు, ఇతర పనులపై వెళ్లే వారు గమ్యస్థానాలకు చేరుకోవడానికి అష్టకష్టాలు పడుతున్నారు. ఎంఎంటీఎస్, మెట్రో రైళ్లే పెద్ద దిక్కుగా మారాయి. హైటెక్ సిటీ తదితర ప్రాంతాలకు ఎంఎంటీఎస్ రైళ్లు అందుబాటులో ఉండడంతో డిమాండ్ అమాంతం పెరిగిపోయింది.

దక్షిణ మధ్య రైల్వే హైదరాబాద్ డివిజన్ పరిధిలో కాచిగూడ, విద్యానగర్, ఆర్ట్స్ కాలేజీ, జమై ఉస్మానియా, సీతాఫల్ మండి, మలక్ పేట, యాకత్ పురా, డబీర్ పురా, ఉప్పుగూడ, ఫలక్ నుమా తదితర స్టేషన్లున్నాయి. రోజూ తెల్లవారుజామున 4.30గంటలకు ఫస్ట్ ట్రైన్ స్టార్ట్ అవుతుంది. సికింద్రాబాద్ నుంచి ఫలక్ నుమాకు ఇది వెళుతుంది. రాత్రి 11 గంటల వరకు మొత్తం 110 ఎంఎంటీఎస్ లోకల్ రైలు సర్వీసులు అందుబాటులో ఉన్నాయి. సమ్మె నేపథ్యంలో రైళ్లు కిటకిటలాడుతున్నాయి.

ప్రయాణీకుల డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని ఆయా వేళల్లో రైళ్లు అందుబాటులో ఉండేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ప్రతి రోజు సగటున 30 వేల మంది ప్రయాణం సాగిస్తుంటారు. ప్రభుత్వ, ప్రైవేటు, విద్యార్థుల నుంచి ఫుల్ డిమాండ్ ఉంది. హైటెక్ సిటీకి వెళ్లే సాఫ్ట్ వేర్ ఉద్యోగులు కూడా ఎంఎంటీఎస్ రైళ్లను ఆశ్రయిస్తున్నారు. సమ్మె దృష్ట్యా రోజు 40-45 వేల మంది రైళ్లలో ప్రయాణీస్తున్నారని అధికారులు వెల్లడిస్తున్నారు. 
Read More : ఇంకెన్నీ రోజులు : ఆర్టీసీ సమ్మె 30 రోజులు