కాంగ్రెస్‌లో ప్రగతి భవన్ ముట్టడి చిచ్చు పెట్టింది. తమకు సమాచారం ఇవ్వకుండా రేవంత్ ప్రగతి భవన్ ముట్టడికి పిలుపునిచ్చారని సీనియర్లు అగ్గిమీద గుగ్గిలమవుతున్నారు. రేవంత్ ఎవరిని సంప్రదించి ముట్టడి ప్రకటించారని ప్రశ్నిస్తున్నారు. ప్రగతి భవన్ ముట్టడి పిలుపు కొందరు నేతల సొంత కార్యక్రమమన్న సీనియర్లు.. దీనిపై అధిష్ఠానానికి ఫిర్యాదు చేయనున్నారు. 2019, అక్టోబర్ 22వ తేదీ మంగళవారం కాంగ్రెస్ శాసనభాపక్ష కార్యాలయంలో సీఎల్పీ నేత భట్టి విక్రమార్కతో పలువురు కాంగ్రెస్ నాయకులు సమావేశమయ్యారు.
ఈ సందర్భంగా సోమవారం కాంగ్రెస్ తలపెట్టిన ప్రగతిభవన్ ముట్టడి కార్యక్రమంపై వాడివేడిగా చర్చించారు. నేతలెవరికి సమాచారం ఇవ్వకుండా పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి ప్రగతిభవన్ ముట్టడికి పిలుపునిచ్చారని నాయకులు భట్టి వద్ద ఆవేదన వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డి ఎవరిని సంప్రదించి ముట్టడి ప్రకటించారని ప్రశ్నించారు. పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా ముట్టడిలో పాల్గొనాలంటూ ప్రకటన విడుదల చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ వ్యక్తులతో నడిచే పార్టీ కాదన్నారు మధుయాష్కి. రేవంత్‌రెడ్డి వ్యవహారాన్ని రేపోమాపో అధిష్ఠానం దృష్టికి తీసుకెళ్లనున్నారు. మరోసారి జరగకుండా కఠిన చర్యలు చేపట్టాలని కోరనున్నారు.
Read More : విలీనం మినహా : ఆర్టీసీ సమ్మె..ముందడుగు