హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర ఎన్నికల ఫలితాలపై కాంగ్రెస్ ఇంకా తేరుకోలేనట్టు ఉంది. ఫలితాలు..ఓటమిలపై ఇంకా పోస్టుమార్టం నిర్వహిస్తూనే ఉంది. ఇటీవలే తెలంగాణ రాష్ట్రంలో జరిగిన ఎన్నికల్లో టీఆర్ఎస్ విజయదుందుభి మ్రోగించింది. మహాకూటమిగా అవతరించి..పెద్దన్నగా వ్యవహరించిన…కాంగ్రెస్‌లోని పెద్ద తలకాయలు సైతం ఓటమి బాట పట్టారు. తాజాగా తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ఇన్‌ఛార్జీ కుంతియా పోస్టుమార్టం నిర్వహించేందుకు హైదరాబాద్‌కు వచ్చారు.
గోల్కోండ హోటల్‌లో సమావేశం…
డిసెంబర్ 31వ తేదీ సోమవారం గోల్కోండ హోటల్‌లో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి టీపీసీసీ చీఫ్ ఉత్తమ్, రేవంత్, దామోదర…ఇతర కీలక నేతలు హాజరయ్యారు. తక్కువ ఓట్లతో పరాజయం చెందిన వారు కూడా ఇందులో పాల్గొన్నారు. ఎన్నికల ఫలితాలు, ఓటమికి గల కారణాలపై చర్చిస్తున్నారు.
రజత్ కుమార్‌పై దామోదర ఫైర్…
మరోవైపు సీఈవో రజత్ కుమార్‌పై కాంగ్రెస్ సీనియర్ నేత దామోదర రాజనర్సింహ ఫైర్ అయ్యారు. రజత్ నిర్ణయాలపై తమకు అనుమానాలున్నాయని…రైతుబంధు పథకం డబ్బులు నేరుగా బ్యాంకులో వేయాలని రజత్ కుమార్ ఎందుకు చెప్పాలని ఓటమి అనంతరం ఇప్పుడు ప్రశ్నించారు. పార్టీ ఓటమికి మాత్రం అందరం బాధ్యులేమంటూ సెలవిచ్చారు.