కాపురంలో కరోనా చిచ్చు : వస్తానన్న భర్త, వద్దంటున్న భార్య

  • Publish Date - March 30, 2020 / 05:06 AM IST

కరోనా వైరస్ ఎఫెక్ట్ తో  ప్రజలంతా హడలిపోయి ఇళ్ళకే పరిమితమవుతున్నారు.  మనిషికి మనిషికి మధ్య సామాజిక దూరాన్ని పాటిస్తున్నారు. ఇప్పుడు ఇదే సంసారాల్లో గొడవలకు కారణం అవుతోంది.  కరోనా వైరస్ చేస్తున్న ఆగడాలు అన్నీ ఇన్నీ కావు. చివరికి భార్యా భర్తల మధ్య గొడవ పెట్టి పోలీసు స్టేషన్ లో పంచాయతీ వరకు వెళ్ళింది.

కర్నూలు జిల్లా ఆదోని మండలంలోని ఒక గ్రామంలో నివసించే లారీ డ్రైవర్ వెంకటరావు (పేరు మార్చాము)  పొట్ట కూటికోసం తెలంగాణలోని మిర్యాల గూడ వచ్చి అక్కడ పని చేస్తూ కుటుంబానికి డబ్బులు పంపిస్తూ జీవనం సాగిస్తున్నాడు.

ఇటీవల కరోనా వైరస్ వ్యాప్తి నిరోధానికి కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా లాక్ డౌన్ ప్రకటించిన సంగతితెలిసిందే. లాక్ డౌన్ కారణంగా  వెంకటరావు స్వగ్రామనికి చేరుకుని ఇంటికి వెళ్ళాడు. తీరా ఇంటికి వెళ్లే సరికి అతనిభార్య లోపలికి రానివ్వలేదు.  

దీనికి కారణం కరోనా…  లారీ డ్రైవర్ గా ఎక్కడెక్కడో తిరిగి వచ్చిన భర్తను ముందు కరోనా పరీక్షలు చేయించుకున్న తర్వాతే ఇంట్లోకి రానిస్తానని పట్టుపట్టింది.  అతను పట్టువీడలేదు.ఇంట్లోకి వెళ్లటానికి ప్రయత్నించాడు. భార్య ససేమిరా అంది.  దీంతో ఇద్దరి మధ్య  గొడవ జరిగింది. ఇద్దరూ పట్టువీడకపోవటంతో గొడవ పెరిగింది.

వ్యవహారం పోలీసు స్టేషన్ దాకా వెళ్లింది. భార్య ఆదోని పోలీసు స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు చేసింది.  పోలీసులు దంపతులు ఇద్దరినీ ఆదోని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. డాక్టర్ లింగన్న వెంకటరావుకు వైద్య పరీక్షలు నిర్వహించి క్వారంటైన్ కేంద్రానికి తరలించారు. 

Also Read | మద్యం ప్రియుళ్లకు శుభవార్త