తెలంగాణలో క్వారంటైన్‌లో ఉన్నవారికి Geo ట్యాగ్ : 50 మీటర్లుదాటి బయట తిరిగితే పోలీసులు పట్టేస్తారు! 

  • Publish Date - March 28, 2020 / 11:34 AM IST

కరోనా వైరస్ విజృంభిస్తోంది. రోజురోజుకీ కొత్త కరోనా కేసులు నమోదవుతున్నాయి. కరోనాను కట్టడి చేసేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏప్రిల్ 15 వరకు (21 రోజుల పాటు) లాక్ డౌన్ విధించింది. అప్పటివరకూ ఎవరూ బయటకు రావొద్దని.. అందరూ ఇంట్లోనే సెల్ఫ్ క్వారంటైన్ లోనే ఉండాలని సూచించింది. కానీ, చాలామంది క్వారంటైన్ పాటించకుండా బయటకు వచ్చేస్తున్నారు. అవసరం లేకపోయినా రోడ్లపై తిరుగుతూ కనిపిస్తున్నారు.

అంతేకాదు.. విదేశాల నుంచి వచ్చినవారిలో కూడా చాలామంది క్వారంటైన్ పాటించడం లేదు. దాంతో తెలంగాణ పోలీసులు క్వారంటైన్ ప్రోటోకాల్ ఉల్లంఘించే వారిపై నిఘా పెడుతున్నారు. బయటకు అడుగుపెడితే చాలు.. వెంటనే వారు ఎక్కడ ఉన్నారో కనిపెట్టేస్తున్నారు. ప్రత్యేకించి విదేశాల నుంచి వచ్చిన వారిపై నిఘాకు ఆధునిక టెక్నాలజీ వినియోగిస్తున్నారు. 

తెలంగాణ కాప్‌లో సరికొత్త అప్లికేషన్‌ను పోలీసులు అందుబాటులోకి తీసుకొచ్చారు.  ఒక్క రోజులోనే హౌస్ క్వారంటైన్ అప్లికేషన్‌లో విదేశాల నుంచి వచ్చిన 22వేల మంది వివరాలను తెలంగాణ పోలీసులు పొందుపరిచారు. వారం రోజుల నుంచి హోం క్వారంటైన్‌లో ఉన్నవారిల కదలికల పరిశీలించారు. అప్లికేషన్ లో నమోదైన వివరాలను జియో ట్యాగింగ్ తో అనుసంధానం చేశారు.

ఇంటినుంచి 50 మీటర్ల జియో ట్యాగింగ్ పరిధి దాటి బయటకు వస్తే.. తక్షణమే పోలీస్ కంట్రోల్ రూంకు ఆటో మెటిక్ గా సమాచారం అందుతుంది. నిమిషాల వ్యవధిలోనే అక్కడికి పోలీసులు చేరుకునే విధంగా ఏర్పాట్లు చేశారు. దేశంలోని అన్ని రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తున్నారు తెలంగాణ పోలీసులు.  ఇప్పటివరకూ తెలంగాణలో కరోనా కేసులు 59కి చేరాయి. అందులో ఒకరికి నయం కాగా.. మొత్తం 58మంది చికిత్స తీసుకుంటున్నారు.