కరోనా మహమ్మారి కారణంగా ప్రపంచం అంతా స్తంభించిపోయింది. మన తెలుగు రాష్ట్రాల్లో కూడా కరోనా ప్రభావం తీవ్రంగా ఉంది. దేశవ్యాప్తంగా కరోనా కరాళ నృత్యానికి ప్రజలు ఇబ్బందులు పడుతుండగా.. లాక్‌డౌన్ కారణంగా వందల కిలోమీటర్లు నడుస్తూ ఊరికి చేరాలని రోడ్లు ఎక్కిన కూలీలు పరిస్థితి అయితే దారుణంగా ఉంది. ఇప్పటికే బతుకుతెరువు కోసం పక్క రాష్ట్రాలకు వెళ్లి లాక్ డౌన్ అవ్వడంతో ఇంటికి తిరిగిరావడానికి ప్రయాణ సౌకర్యం లేక చివరకు నడిచి వస్తూ.. 500కిలో మీటర్లు నడిచి చివరకు హైదరాబాద్‌కు చేరుకున్నాక చనిపోయాడు.
వివరాల్లోకి వెళ్తే.. తమిళనాడుకు చెందిన లోగేష్ బాల సుబ్రహ్మణ్యం అనే యువకుడు మహారాష్ట్రలోని నాగపూర్‌కు పనుల నిమిత్తం వలస వెళ్లాడు.. అయితే లాక్ డౌన్ అవడంతో అక్కడి నుంచి కాలిబాటన సొంతూరికి బయల్దేరాడు. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం లాక్‌డౌన్ విధించడంతో పనిలేక, తింటానికి తిండిలేక, ఇక అక్కడ ఉండలేక పొట్టచేతపట్టుకుని కాలిబాటన తన స్వగ్రామం తమిళనాడులోని నమక్కళ్‌కు బయలుదేరాడు.
అయితే మూడు రోజుల పాటు సుమారు 500 కిలోమీటర్లు నడిచిన తర్వాత సికింద్రాబాద్ చేరుకునే సమయంలో తీవ్ర అస్వస్తతకు గురయ్యాడు. లోగేష్‌ను గమనించిన స్థానికులు అధికారులకు సమచారం ఇవ్వడంతో ఓ షెల్టర్ హోంకు తరలించగా.. చికిత్స పొందుతూ అతను కన్నుమూశాడు. పోస్ట్‌మార్టం నిమిత్తం అతని మృతదేహాన్ని వైద్యులు గాంధీ ఆస్పత్రికి తరలించారు. వేసవి కాలంలో ఎక్కువ దూరం నడవడంతో డీహైడ్రేషన్ కారణంగా అతను చనిపోయినట్లు వెల్లడించారు అధికారులు.
Also Read | కరోనా కలకలం : ధారావిలో ఏం జరుగుతోంది ?