కరోనా వైరస్ కారణంగా విదేశాల నుంచి ఎవరైనా వస్తున్నారు అంటే కంగారు ఎక్కువైపోయింది. అయితే విదేశాల నుంచి వస్తున్నవాళ్లు చేస్తున్న పని కూడా కాస్త ఇబ్బంది పెడుతుంది. విదేశాల నుంచి వస్తున్నవారు కొంతమంది విమానం దిగాక థర్మల్ స్క్రీనింగ్‌కు దొరక్కుండా ఉండేందుకు జ్వరానికి ఉపయోగించే పారాసిట్మాల్ టాబ్‌లెట్లు వేసుకుని ఒంట్లోని ఉష్ణోగ్రతలను తగ్గించుకుంటున్నారు. (కరోనా ఎఫెక్ట్ : సోనమ్‌కు స్క్రీనింగ్ చేయలేదు – షాహిద్ జిమ్ తెరిపించాడు..)
విమానం దిగే గంట ముందు ఈ మాత్రలు వేసుకోవడంతో శరీర ఉష్ణోగ్రతలు తగ్గిపోయి స్క్రీనింగ్‌లో దొరక్కుండా ఉంటున్నారు. సాధారణ ఉష్ణోగ్రతలు ఉన్న వారిని ‘సీ’కేటగిరీ కింద భావించి నేరుగా ఇళ్లకు పంపుతారు. ఇంటి దగ్గరే ఐసోలేషన్‌లో ఉండమని సూచిస్తున్నారు. ఈ క్రమంలో వీళ్లు ఇంటికెళ్లిపోతున్నారు. జ్వరం ఉంటే ఎక్కడ గాంధీ ఆస్పత్రి లేదా క్వారంటైన్ కేంద్రాలకు వెళ్లాల్సి వస్తుందోననే భయంతో కొందరు ఇలా బయటపడుతున్నారు.
ఈ విషయం రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ దృష్టికి రావడంతో ఇటువంటి కేసుల్లో అప్రమత్తంగా ఉండాలంటూ అధికారులకు సూచనలు చేసింది. మూడ్రోజుల కిందట ఇలాగే దుబాయి నుంచి వచ్చిన ఓ వ్యక్తి పారాసిట్మాల్ వేసుకొని, థర్మల్ స్క్రీనింగ్‌కు దొరకలేదు. అటువంటివారు ప్రమాదం అని అధికారులు అంటున్నారు.