కోట్ల రూపాయల అక్రమాలు, దొంగ లెక్కలు, కాలం చెల్లిన మందులు..తెలంగాణ వెల్‌నెస్‌ కేంద్రాల్లో విచ్చలవిడిగా అవినీతి

  • Publish Date - November 7, 2020 / 11:36 AM IST

corruption in telangana wellness centers: తెలంగాణ వెల్‌నెస్‌ కేంద్రాల్లో విచ్చలవిడిగా సాగుతున్న అవినీతిపై 10టీవీ ప్రసారం చేసిన కథనాలు సంచలనం రేపాయి. 10టీవీ కథనాలతో అధికార యంత్రాంగం పరుగులు పెడుతోంది. వెల్‌నెస్‌ కేంద్రాల్లో అక్రమాల గుట్టు విప్పేందుకు విజిలెన్స్‌ అధికారులు రెడీ అయ్యారు. రాష్ట్రవ్యాప్తంగా వెల్‌నెస్‌ కేంద్రాల్లో తనిఖీలు చేసేందుకు సిద్ధమయ్యారు. ఈ మందుల మాఫియా వెనుక ఆరోగ్యశాఖలోని కీలక వ్యక్తి హస్తం ఉన్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

అక్రమాలకు కేరాఫ్ అడ్రస్ గా వెల్ నెస్ సెంటర్లు:
తెలంగాణలో ఉద్యోగుల‌ు, పెన్షనర్ల ఆరోగ్య అవసరాల కోసం ఏర్పాటు చేసిన వెల్‌నెస్ సెంట‌ర్లు అక్రమాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారిపోయాయి. అక్రమాల దందాలో ఆరితేరిన వ్యక్తుల క‌నుస‌న్నల్లో ఈ దందా మూడు ట్యాబ్లెట్లు, ఆరు టానిక్‌లుగా సాగిపోతోంది. కరోనా కాలంలో ఆరోగ్య శాఖ పెద్దగా దృష్టి పెట్టకపోవడంతో అక్రమార్కులు యథేచ్చగా రెచ్చిపోతున్నారు. వాళ్లు ఆడిందే ఆటగా.. పాడిందే పాటగా దందా సాగుతుండటంతో.. ప్రభుత్వ ఖజానాకు భారీగా గండి పడుతోంది.

కంపెనీలు, ఏజెన్సీలతో కుమ్మక్కు, ప్రభుత్వ సొమ్ము స్వాహా:
వెల్‌నెస్ సెంటర్లకు వచ్చే వారి కోసం ప్రభుత్వం అన్ని వసతులు ఏర్పాటు చేసింది. వైద్య సేవల నుంచి మందుల వరకు కోట్ల రూపాయలు వెచ్చించి ప్రభుత్వమే ఉచితంగా అందిస్తోంది. ఇక్కడే అక్రమార్కులు తమ చేతివాటం చూపిస్తున్నారు. కాలం చెల్లిన మందులు కొనుగోలు చేస్తూ… దందాకు తెరలేపారు. తమకు నచ్చిన కంపెనీలు, ఎజెన్సీలతో కుమ్మక్కై ఎక్స్‌పైరీ డేట్ దాటిన.. కొన్ని రోజుల్లోనే ఎక్స్‌పైరీకి దగ్గరలో ఉన్న మందులను నామమాత్రం ధరకు కొంటున్నారు. కానీ.. రెగ్యులర్ రేట్లకే కొంటున్నామంటూ ప్రభుత్వానికి బిల్లులు పెడుతున్నారు. ఆ మందులను అవగాహన లేని పేషెంట్లకు అంటగడుతూ.. వారి ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. ఇలా స్వాహా చేస్తున్న ప్రభుత్వ సొమ్మును వాటాలేసుకుని మరీ పంచుకుంటున్నారు.


అధికారుల అనుమతి లేకుండానే రాత్రి పూట మందులు తరలింపు:
నిత్యం రద్దీగా ఉండే ఖైరతాబాద్ వెల్‌నెస్ సెంటర్ నుంచి కాలం చెల్లిన మందులను తరలిస్తున్న వ్యవహారం టెన్ టీవీ కెమెరాకు చిక్కింది. అసలు ఆఫీసు సమయం ముగిసిన తర్వాత మందులను ఎందుకు తరలిస్తున్నారు. అధికారుల అనుమతి లేకుండానే రాత్రి పూట మందులను ఎందుకు తీసుకెళ్తున్నారనే విషయంపై 10 టీవీ కూపీ లాగింది. ఆ మందులన్నీ ఇతల జిల్లాల్లోని వెల్‌నెస్ సెంటర్లకు చేరాల్సిన మందులుగా తేలింది. అయితే.. ఇతర జిల్లాలకు పంపించాల్సిన మందులను కూడా.. ఖైరతాబాద్ వెల్‌నెస్ సెంటర్‌లో ఎందుకు ఉంచాల్సి వచ్చింది. ఇవే ప్రశ్నలను టెన్ టీవీ లేవనెత్తుతోంది. అంటే ఇతర జిల్లాల్లోని వెల్‌నెస్ సెంటర్లకు వెళ్లే వారికి మందుకు ఇవ్వడం లేదా.. ఒక వేళ మందులను బయట తెచ్చుకోవాలని రాసి చేతులు దులుపుకుంటున్నారా?

అవసరం లేకున్నా ఇండెంట్లు పెట్టి విచ్చలవిడిగా మందులు కొనుగోలు:
వాస్తవంగా ఫార్మా కంపెనీల నుంచి కొనుగోలు చేసిన మందులను… కాలం చెల్లడానికి మూడు నెలల ముందే వాటిని ఆయా సంస్థలకు వెనక్కి పంపించాల్సి ఉంటుంది. వాటి స్థానంలో కొత్తవి తీసుకోవాలి. అది కూడా సంబంధిత అధికారుల ధృవీకరణ ఉండాలి. కానీ.. ఎక్స్‌పైరీ అయినా.. పెద్దఎత్తున మందులను ఎందుకు నిలువ ఉంచారు. వాటిని ఎక్కడికి తరలించారు. పెద్దఎత్తున మందులు కొనుగోలు చేస్తున్నా… వాటిని వాడటం లేదా… ఇతర కేంద్రాలకు పంపించకపోవడంలో మతలబేంటి.. అంటే… అసలు అవసరం లేకున్నా కూడా… ఇండెంట్లు పెట్టి… విచ్చలవిడిగా మందులు కొంటున్నారనే సమాధానం వస్తోంది.

వెల్‌నెస్ సెంటర్లు నిర్వహిస్తున్న కాంట్రాక్ట్ సంస్థ భారీ అక్రమాలు:
ఓవైపు… భారీగా మందులు ఉన్నా.. వెల్‌నెస్ సెంటర్లకు వెళ్లే పేషెంట్లకు మెడిసిన్ ఇవ్వడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. మందులు లేక పేషెంట్లు ఇబ్బంది పడుతున్నా.. పట్టించుకునే నాథుడే కరువయ్యాడు. అటు ఫార్మసీ కౌంటర్‌కు వెళ్తే.. నో స్టాక్ బోర్డ్ వెక్కిరిస్తుండటంతో.. రోగులు వెనక్కి మళ్లాల్సి వస్తోంది. మరోవైపు.. మందులన్నీ కాలం చెల్లిపోతుండటంతో.. పెద్ద ఎత్తున ప్రజాధనం వృధా అవుతోంది. దీని వల్లం ప్రభుత్వ ఖజానాకు భారీగా గండి పడుతోంది. వాస్తవానికి తెలంగాణ వ్యాప్తంగా ఉన్న వెల్‌నెస్ సెంటర్లు ఔట్ సోర్సింగ్ చేతుల్లో ఉన్నాయి. వీటికి పర్మనెంట్ ఆఫీసర్ కానీ.. శాశ్వత ఉద్యోగి కానీ లేకపోవడంతో… ఆక్రమార్కులు ఆడింది ఆట అన్నట్లుగా వ్యవహారం ఉంది. ఈ తతంగం మొత్తానికీ వెల్‌నెస్ సెంటర్లు నిర్వహిస్తున్న కాంట్రాక్ట్ సంస్థ భారీగా అక్రమాలకు పాల్పడుతోంది. అటు ఉద్యోగుల నియామకాల్లో కూడా అవినీతి జరుగుతోందని టెన్ టీవీ పరిశోధనలో తేలింది.