సీపీఐ యూ టర్న్ : హుజూర్‌నగర్‌ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్‌కు మద్దతు లేదు

  • Publish Date - October 14, 2019 / 02:23 PM IST

హుజూర్ నగర్ ఉప ఎన్నికలో టీఆర్ఎస్‌కు తామిచ్చిన మద్దతును ఉపసంహరిస్తున్నట్లు సీపీఐ నేత చాడ వెంకట్ రెడ్డి ప్రకటించారు. అక్టోబర్ 14వ తేదీ సోమవారం ఆయన మీడియాకు వెల్లడించారు. అంతకుముందు సోమవారం మగ్దూం భవన్‌లో సీపీఐ కౌన్సిల్ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి సీపీఐ ముఖ్య నేతలు చాడ వెంకట్ రెడ్డితో పాటు జాతీయ నేత సురవరం సుధాకర్ రెడ్డి, ఇతర కీలక నేతలు పాల్గొన్నారు. 

ఏ పార్టీకి మద్దతిచ్చే విషయంలో హుజూర్ నగర్ పార్టీ కార్యకర్తలు, ఇతరులతో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు చాడ. మూడు రోజుల్లో ఈ నిర్ణయాన్ని వెలువరిస్తామన్నారు. తాము మద్దతు ఎందుకు ఉపసంహరించాల్సి వచ్చిందో టీఆర్ఎస్ ఆలోచించాలన్నారు. అక్టోబర్ 19వ తేదీ వరకు రోజు వారీ కార్యక్రమాలను ఆర్టీసీ ప్రకటించిన విషయాన్ని గుర్తు చేశారు. ఆర్టీసీ జేఏసీ నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశాల్లో తాము పాల్గొనడం జరిగిందన్నారు. చర్చలకు ఆహ్వానించాలని, కేసీఆర్ మొండి వైఖరి విడనీడాలని సూచించారు. ఆర్టీసీ కార్మికులకు తాము అండగా ఉంటామని ప్రకటించారు. 

విలీనం అనే అంశం ఇప్పటిది కాదని..2013 ఉమ్మడి రాష్ట్రంలో కిరణ్ కుమార్ రెడ్డి సీఎంగా ఉన్న సమయంలో ప్రభుత్వంలో ఆర్టీసీ విలీన అంశంలో కమిటీ నియమించడం జరిగిందని, తెలంగాణ ఉద్యమం నడుస్తుండడంతో ఇది ఆలస్యమైందన్నారు. ప్రస్తుతం దీని గురించి ఆలోచించాలన్నారు. విలీనం అంశం, ఇతర డిమాండ్ల విషయంలో ప్రభుత్వం మరోసారి ఆలోచించాలన్నారు. కార్మికులు ఆత్మహత్యలకు పాల్పడుతుంటే ప్రభుత్వం పట్టించుకోవడం లేదని, రాష్ట్రంలో ఘర్షణ వాతావరణాన్ని ప్రభుత్వం సృష్టిస్తోందని తెలిపారు ఏది ఏమైనా చర్చల ద్వారానే సమస్యలు పరిష్కారమౌతుందని స్పష్టం చేశారు. 

ఇదిలా ఉంటే..సీపీఐ నేతలకు టీఆర్ఎస్ ఎంపీ కేశవరావు ఫోన్ చేశారు. మద్దతు ఉపసంహరించవద్దని సూచించారు. అయినా..ఆయన మాటల వినలేదు. మద్దతు ఉపసంహరించడంతో టీఆర్ఎస్ ఎలా స్పందిస్తుందో చూడాలి. 
Read More : సీపీఐ నేతలకు కేకే ఫోన్ : మద్దతు ఉపసంహరించవద్దు