వడగాల్పులు : నిప్పుల కొలిమిలా తెలంగాణ

  • Publish Date - April 15, 2019 / 02:55 AM IST

హైదరాబాద్: రాష్ట్రంలో ఎండల తీవ్రత నానాటికీ పెరుగుతోంది. ఎండ వేడిమి నిప్పుల కొలిమిని తలపిస్తోంది. రోజు రోజుకూ ఉష్ణోగ్రతల్లో పెరుగుదల కనిపిస్తోంది. కొన్ని జిల్లాల్లో ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 7 డిగ్రీలు ఎక్కువగా నమోదవుతున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు.  ఉదయం 9 గంటల నుంచే ఎండ తీవ్రత ఎక్కువగా ఉంటోంది. మధ్యాహ్నం సమయంలో బయటకు రావటానికి ప్రజలు జంకుతున్నారు. దీంతో రోడ్లన్నీనిర్మానుష్యంగా కనపడుతున్నాయి. ఆదివారం రాష్ఠ్రంలోని  పెద్దపల్లి, కరీంనగర్ లలో  అత్యధికంగా 44.4 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదుయ్యాయి. 

సౌత్ ఇంటీరియర్ కర్ణాటక నుంచి కోమోరిన్ ప్రాంతం వరకు ఇంటీరియర్ తమిళనాడు మీదు గా 0.9 కిలోమీటర్ల ఎత్తు వరకు ఉపరితల ద్రోణి ఏర్పడింది. దీని  ప్రభావంతో ఆదివారం సాయంత్రం ఆసిఫాబాద్ జిల్లాలో  వర్షం కురిసింది. జిల్లాలోని జైనూర్ మండలం  కర్నుంగూడ లో పిడుగు పడి ఓ యువకుడు మరణించాడు.  మరో యువకుడికి  గాయాలయ్యాయి. 

సోమవారం రాష్ట్రంలో అక్కడక్కడా ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు వాతావరణ కేంద్రం అధికారి రాజారావు చెప్పారు. ఉపరితల ద్రోణి ప్రభావంతో రాగల 24 గంటల్లో గ్రేటర్ హైదరాబాద్‌లోని పలుచోట్ల ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడి న వర్షం కురిసే అవకాశమున్నట్టు హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ప్రస్తుతం బలహీనంగా ఉన్న ద్రోణి 24గంటల్లో బలపడే అవకాశమున్నట్టు అధికారులు పేర్కొన్నారు. అయితే పగటి ఉష్ణోగ్రతలు మాత్రం అధికంగానే నమోదవుతాయన్నారు. హైదరాబాద్ నగరంలో ఆదివారం 39.7 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది.

ట్రెండింగ్ వార్తలు