కార్తీకమాసం మూడవ సోమవారం కావటంతో ఈరోజు తెల్లవారుఝాము నుంచే శివాలయాలు భక్తులతో కిటకిట లాడుతున్నాయి. శివకేశవులకు కార్తీకం అత్యంత ప్రీతికరమైనది. అందులోనూ సోమవార అంటే శివుడికి మహా ప్రీతి. ఇక కార్తీకమాసం మూడో సోమారం అవటంతో తెలుగు రాష్ట్రాల్లోని శివాలయాలు శివనామ స్మరణతో మార్మోగి పోతున్నాయి. తూర్పు గోదావరిజిల్లా అన్నవరంలోని శ్రీ వీర వెంకట సత్యనారాయణస్వామి వారి ఆలయంలోనూ భక్తుల రద్దీ విపరీతంగా ఉంది. తెల్లవారుఝూమున 2 గంటల నుంచే వ్రతాలు ప్రారంభించి, మూడు గంటల నుంచి భక్తులను సర్వదర్శనాలకు అనుమతించారు.
ఇక దక్షిణ కాశీగా పేరు పొందిన ద్రాక్షారామంలోని శ్రీ మాణిక్యాంబ సమేత శ్రీ భీమేశ్వర సామి ఆలయం భక్తులతో కిటకిటలాడుతోంది. తెల్లవారుజాము నుంచే భక్తులు సప్తగోదావరిలో సాన్నం చేసి..కార్తీక దీపాలు వెలిగిస్తున్నారు. జిల్లాలోని మరో పుణ్యక్షేత్రం పాదగయ క్షేత్రం శ్రీ ఉమా కుక్కుటేశ్వర స్యామి ఆలయంలో కూడా భక్తుల రద్దీ పెరిగింది. పాదగయ పుష్కరణిలో స్నానం చేసి.. కార్తీక దీపాలు వెలిగించి భక్తులు ప్రత్యేక పూజలు చేస్తున్నారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలలోని భద్రాచలంలో కార్తీక సోమవారం సందర్భంగా పవిత్ర గోదావరిలో భక్తులు పుణ్యస్నానాలు చేసి.. శివాలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు.అటు వేములవాడ రాజన్న ఆలయంలోనూ,జయశంకర్ భూపాల పల్లి జిల్లా, మహాదేవ్ పూర్ మండలంలోని కాళేశ్వరంలోని కాళేశ్వర ముక్తేశ్వర ఆలయంలోనూ భక్తులు సమీపంలోని గోదావరి లో పుణ్యస్నానాలు ఆచరించి, కార్తీక దీపాలు వెలిగిస్తున్నారు.