కబూతర్ జా..జా : సహాయక చర్యల్లో GHMC

  • Publish Date - October 26, 2019 / 01:55 AM IST

కబూతర్ జా..జా..ఓ పాట. మై నే ప్యార్ కియా సినిమాలో ఉన్న ఈ సాంగ్ పాపులర్ అయ్యింది. ప్రస్తుతం జీహెచ్ఎంసీ అధికారులు కబూతర్..జా..జా..అంటున్నారు. కపోతాల వల్ల శ్వాసకోశ సంబంధ సమస్యలు వ్యాపిస్తున్నాయి. దీంతో నగర ప్రజల్లో ఆందోళన నెలకొంది. నగర వాసుల ఆరోగ్యానికి ప్రాణాంతకంగా మారిన పావురాలపై లెటెస్ట్‌గా జీహెచ్ఎంసీ దృష్టి సారించింది.

వాటిని పట్టుకుని అటవీ ప్రాంతానికి తరలించాలని అధికారులు నిర్ణయించారు. 2019, అక్టోబర్ 25వ తేదీ శుక్రవారం జీహెచ్ఎంసీ అధికారులు నగరంలోని పలు ప్రాంతాల్లో పర్యటించారు. పావురాలను పట్టుకుని అటవీ ప్రాంతాలకు తరలించారు. మొజంజాహీ మార్కెట్‌లో 500 పావురాలను పట్టుకున్నారు. అటవీ శాఖ సలహా మేరకు వాటిని శ్రీశైలం అటవీ ప్రాంతంలో సురక్షితంగా వదిలేశారు. 

నగరంలో మొత్తం 6 లక్షలకు పైగా పావురాలు ఉంటాయని అంచనా వేస్తున్నారు అధికారులు. వీటికి ఆహార గింజలు వేయడాన్ని జీహెచ్ఎంసీ గతంలోనే బ్యాన్ చేసింది. అందులో భాగంగా మొజంజాహి మార్కెట్‌లో పావురాల ఫీడింగ్ కోసం విక్రయిస్తున్న గింజలను వెటర్నరీ విభాగం అధికారులు స్వాధీనం చేసుకున్నారు. పావురాల వల్ల శ్వాసకోశ సంబంధ వ్యాధులు ప్రబలే ప్రమాదం ఉందని..ముఖ్యంగా చిన్న పిల్లలు, వృద్ధులకు వెంటనే సోకుతాయని జీహెచ్ఎంసీ వెటర్నరీ విభాగం అధికారులు వెల్లడించారు. పావురాలు ఇన్ ఫెక్షన్ల వ్యాప్తికి కారణమౌతున్నాయి.

వీటి రెట్టల నుంచి ఇన్‌ఫెక్షన్ కారక సూక్ష్మ క్రిములు గాల్లో కలిసిపోతాయి. రెక్కల నుంచి ఈకల ద్వారా వైరస్, బ్యాక్టీరియా, ఫంగస్ ఏసీల్లోకి చేరిపోతాయి. ఆ గాలిని పీల్చుకోవడం ద్వారా ప్రజలు వ్యాధిగ్రస్తులవుతున్నారు. చర్మం, నోరు, ఊపిరితిత్తులు, ఉదరకోశం దెబ్బతినే అవకాశం ఉంది. అందుకోసం పావురాల రెక్కలు, రెట్టలను ముట్టుకోవద్దని సూచించారు. ఒకవేళ తాకినా..చేతులు శుభ్రంగా చేసుకోకుండా ఏ పనీ చేయకూడదంటున్నారు. 

Read More : హూజూర్ నగర్ ప్రజాకృతజ్ఞత సభ : హాజరు కానున్న సీఎం కేసీఆర్