నగరాల్లో విపత్తుల నిర్వాహణ : మున్సిపల్ అధికారులతో కేటీఆర్ సమీక్ష

  • Publish Date - September 28, 2019 / 01:20 AM IST

విపత్తుల నిర్వహణపై దృష్టి పెట్టిన తెలంగాణ ప్రభుత్వం… వాటిని ఎలా ఎదుర్కోవాలనే విషయంపై దృష్టి పెట్టింది. ఇందులో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని కార్పోరేష‌న్‌ల‌లో విప‌త్తుల నిర్వహణకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని నిర్ణయించింది. ప్రతీ కార్పొరేషన్‌లో డిజాస్టర్ మేనేజ్‌మెంట్, విజిలెన్స్ విభాగాల‌ను ఏర్పాటు చేయాల‌ని భావిస్తోంది. దీనికి సంబంధించిన విధి విధానాలను ఖరారు చేసింది.

విప‌త్తుల నిర్వహ‌ణపై మున్సిపల్ శాఖ అధికారులతో సెప్టెంబర్ 27వ తేదీ శుక్రవారం మంత్రి కేటీఆర్ సమీక్ష నిర్వహించారు. పలు సూచనలు చేశారు. మోడ‌ల్ ప్రాజెక్టులో భాగంగా.. వరంగల్, కరీంనగర్ కార్పొరేషన్లలో మొదటి దశలో విపత్తు నిర్వహణ విభాగాలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఆ త‌ర్వాత  ద‌శ‌ల వారీగా.. అన్నీ కార్పోరేషన్‌లలో ఈ విభాగాల‌ను ఏర్పాటు చేస్తామ‌ని కేటీఆర్ వివరించారు. హైదరాబాద్‌లో డిజాస్టర్ రిలీఫ్‌ ఫోర్స్ సమర్థవంతంగా పని చేస్తోందన్నారు కేటీఆర్. హైదరాబాద్‌లో విపత్కర పరిస్థితుల్లో విధులు నిర్వహిస్తున్న జీహెచ్‌ఎంసీ డిజాస్టర్ మేనేజ్‌మెంట్‌ఫోర్స్‌ టీమ్‌ను ఆయన అభినందించారు. 

జీహెచ్ఎంసీ పరిధిలో జరిగే ఉల్లంఘనల నిర్వహణను ఆన్‌లైన్ పరిధిలోకి తెచ్చేలా ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది ఇందుకోసం సెంట్రల్ ఎన్‌ఫోర్స్‌మెంట్ సెల్ ఏర్పాటు చేసింది. దానికి సంబంధించిన మొబైల్ యాప్‌ను కేటీఆర్ ఆవిష్కరించారు. వీటి ద్వారా భవన అక్రమ నిర్మాణాలు, వ్యర్ధాల పారవేత, చెత్త వేయడం, ఫుట్‌పాత్‌ల ఆక్రమణ.. లాంటి ఉల్లంఘనలు, జరిమానాలను ఈ యాప్ ద్వారా పారదర్శకంగా నిర్వహించ‌నున్నారు. డిజాస్టర్ మేనే‌జ్‌మెంట్‌ ఫోర్స్‌లో పనిచేసే ఉద్యోగులకు ప్రమాదబీమా, ఆరోగ్య బీమా సౌకర్యాన్ని కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది. 
Read More : ఈఎస్ఐ కేటుగాళ్లు : 10tv ఎక్స్‌క్లూజివ్ ఆడియో క్లిప్స్