పుకార్లు నమ్మకండి : రేషన్ కార్డులు తొలగించట్లేదు

  • Publish Date - March 6, 2019 / 04:14 PM IST

హైదరాబాద్: రాష్ట్రంలో రేషన్ కార్డులు తొలగిస్తున్నారనే వార్తలు నమ్మవద్దని పౌరసరఫరాల శాఖ కమీషనర్ అకున్ సబర్వాల్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. రైతు బంధు లబ్ధిదారుల కు సంబంధించిన రేషన్ కార్డులు తొలగిస్తున్నారనే వార్తల్లో నిజం లేదని ఆయన చెప్పారు.  ఈవిషయమై పౌరసరఫరాల శాఖ ఉత్తర్వులు జారీ చేయలేదని ఆయన వివరణ ఇచ్చారు.
రేషన్ కార్డుల తొలగింపుపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, రైతుల రేషన్ కార్డులను తొలగించాలనే ఆలోచన ప్రభుత్వానికి లేదని ఆయన పేర్కొన్నారు. రేషన్ కార్డు కలిగిన ప్రతి ఒక్కరికీ సరుకులు పంపిణీ చేస్తాం. అర్హులైన లబ్ధిదారుల కార్డులను తొలగించలేదు. ఇటీవల పౌరసరఫరాల శాఖ 3.50 లక్షల మందికి కార్డులు జారీ చేసిందని అకున్ సబర్వాల్ స్పష్టం చేశారు.