తెలంగాణ అసెంబ్లీ : పద్మారావు నిగర్వి : కేసీఆర్

  • Publish Date - February 25, 2019 / 04:24 AM IST

తెలంగాణ రాష్ట్ర శాసనసభ డిప్యూటీ స్పీకర్‌గా తిగుళ్ల పద్మారావు గౌడ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఫిబ్రవరి 25వ తేదీ సోమవారం సమావేశాలు ప్రారంభమయ్యాయి. డిప్యూటీ స్పీకర్‌గా పద్మారావు ఎన్నికైనట్లు స్పీకర్ ప్రకటించారు. సీఎం కేసీఆర్, ప్రతిపక్షాల నేతలు తొడ్కొని రాగా పద్మారావు గౌడ్ ఛైర్‌లో ఆసీనులయ్యారు. స్పీకర్ పోచారం, సీఎం కేసీఆర్, పార్టీలకు చెందిన సభ్యులు అభినందనలు తెలిపారు. డిప్యూటీ స్పీకర్ ఎన్నికలో ఫిబ్రవరి 23వ తేదీ శనివారం నామినేషన్ల దాఖలుకు గడువు ముగిసింది. ఆ సమయానికి పద్మారావు గౌడ్ ఒక్కరే నామినేషన్ దాఖలు చేశారు. దీంతో డిప్యూటీ స్పీకర్ ఎన్నిక ఏకగ్రీవమైంది. 

ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ…ఉపసభాపతిగా పద్మారావు గౌడ్ ఎన్నిక కావడం సంతోషాన్ని కలిగిస్తోందన్నారు. 2001లో తెలంగాణ ప్రజల ప్రయాణం ఏడారిలా సాగిందని, పిడికెడు మందితో సాగిన ఉద్యమంలో జంటనగరాల నుండి పద్మారావు అందరికంటే ముందు పాల్గొని యాక్టివ్‌ రోల్ పోషించారని తెలిపారు. తెలంగాణ రాష్ట్రం సిద్ధించాలని పరేడ్ గ్రౌండ్‌లో నిర్వహించిన సభను విజయవంతం చేసేందుకు పద్మారావు ఎనలేని కృ‌షి చేశారని కొనియాడారు. మూడు సార్లు శాసనసభకు ఎన్నికయ్యారని, నిగర్విగా ఉంటారన్నారు. 

రంగారెడ్డి, జంటనగరాల్లో కల్లు దుకాణాలు మూసివేస్తే టీఆర్ఎస్ ఫైట్ చేయడం జరిగిందని, అనంతరం టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తరువాత ఎక్సైజ్ శాఖ మంత్రిగా పదవీ బాధ్యతలు స్వీకరించిన పద్మారావు ఆ శాఖకు వన్నె తెచ్చారని తెలిపారు. అదే సామాజిక వర్గానికి చెందడంతో కల్లు దుకాణాలు, దానిపై ఆధారపడిన వారి జీవితాల బాగోగుల కోసం తీవ్రంగా కృషి చేశారని సభకు తెలిపారు. తాటి, ఈత చెట్లు పెంచడం, గీత కార్మికుల శ్రేయస్సు కోసం పద్మారావు పనిచేశారని కొనియాడారు..