సింగరేణి కాలరీస్‌లో గుర్తింపు కార్మిక సంఘానికి నవంబర్‌లో ఎన్నికలు జరిగే అవకాశం ఉందని యూనియన్ల నాయకులు భావిస్తున్నారు. 2015 అక్టోబర్ 5న జరిగిన ఎన్నికల్లో టీఆర్‌ఎస్ అనుబంధ తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం విజయం సాధించింది. గుర్తింపు యూనియన్‌గా టీజీబీకేఎస్ రెండేళ్ల కాలపరిమితి పూర్తి కావస్తోంది. దీంతో కార్మిక సంఘాలు మళ్లీ ఎన్నికలకు సిద్ధమవుతున్నాయి.
ఈసారి బీజేపీ అనుబంధ బీఎంఎస్ సింగరేణిలో పాగా వేసేందుకు ప్రయత్నిస్తోంది. కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి సహా పలువురు బీజేపీ నాయకులు సింగరేణి ప్రాంతంలో పర్యటిస్తూ.. ఇతర యూనియన్ల నాయకులను తమవైపు తిప్పుకుంటున్నారు. తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘంలో అంతర్గత విభేదాలు భగ్గుమంటున్న తరుణంలో ఇటీవలి కాలంలో ఆ యూనియన్ నుంచి చాలా మంది బీఎస్‌ఎస్‌లో చేరారు. తెలంగాణ ప్రభుత్వం హాయాంలో సింగరేణి అస్తవ్యస్తంగా మారిందన్నది బీజేపీ నాయకులు వాదన. సింగరేణిలో గుర్తింపు యూనియన్ తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం ఎన్నికలపై కోర్టును ఆశ్రయించింది. కార్మికులకు ఇచ్చిన హామీల అమలుకు రెండేళ్ల కాలపరిమితి చాలదని.. మరో రెండేళ్లు పొడిగించాలని హైకోర్ట్‌లో పిటిషన్ వేసింది.
దేశంలోని ఇతర బొగ్గు సంస్థల్లో గుర్తింపు యూనియన్ కాలపరిమితి రెండేళ్లే ఉన్న విషయాన్ని కార్మిక నాయకులు గుర్తు చేస్తున్నారు.
సింగరేణిలో గుర్తింపు యూనియన్ ఎన్నికలు ఎప్పుడు జరిగినా..ఈసారి కార్మిక సంఘాల మధ్య హోరాహోరీ పోరు తప్పదని భావిస్తున్నారు. మళ్లీ పట్టు బిగించేందుకు తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం, ఈసారి ఎలాగైనా పాగా వేయాలి బీఎంఎస్ ఇప్పటి నుంచే వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్న తరుణంలో పోటీ చేలా ఉంటుందో చూడాలి.
Read More : దసరా రోజున కలకలం : భారీగా నకిలీ మద్యం పట్టివేత