5న ముహూర్తం : ఇక ఎలక్ట్రిక్ బస్సులు 

  • Publish Date - February 3, 2019 / 03:46 AM IST

హైదరాబాద్ : నగర రోడ్లపై ఎలక్ట్రిక్ బస్సులు రయ్యి రయ్యిమంటూ దూసుకపోనున్నాయి. ఆకుపచ్చని రంగులో కలర్ ఫుల్‌గా బస్సులు ముస్తాబయ్యాయి. ప్రజారవాణాలో ఎలక్ట్రిక్ బస్సులను ప్రవేశ పెట్టాలని తెలంగాణ సర్కార్ నిర్ణయించిన సంగతి తెలిసిందే. అందులో భాగంగా బస్సులు తయారయ్యాయి. ఇక ప్రారంభించడమే తరువాయి. ఫిబ్రవరి 05వ తేదీన ముహూర్తం నిర్ణయించారు. మొదటి విడతలో నగరానికి 40 బస్సులు వచ్చాయి. అందులో మియాపూర్ – 2 డిపోకు 20, కంటోన్మెంట్ డిపోకు 20 కేటాయించారు. నగరంలోని రోడ్లపై ఇప్పటికే వీటిని తిప్పారు కూడా. 

ఎలక్ట్రిక్ బస్సులు కావడంతో వీటికి ఛార్జింగ్ అవసరం ఉంటుంది. ఇందుకు మియాపూర్, కంటోన్మెంట్ డిపోల్లో హైటెన్షన్ విద్యుత్ లైన్లు ఏర్పాటు చేశారు. 12 చొప్పున ఛార్జింగ్ పాయింట్లు విధించారు. మియాపూర్ -2 డిపో నుండి శంషాబాద్ విమానాశ్రాయనికి బస్సులు నడుపనున్నారు. 

ఎలక్ట్రిక్ బస్సులు నడుపడం వల్ల కాలుష్యం బాగా తగ్గే అవకాశం ఉంది. ఈ బస్సుల్లో ఆటోమేటిక్ ఎమర్జెన్సీ బ్రేకింగ్, ఎల్ఈడీ దీపాలు, ఏసీ సౌకర్యాలున్నాయి. ఇందులో డ్రైవర్‌తో సహా 40 మంది హాయిగా ప్రయాణించొచ్చు. షార్ట్ సర్క్యూట్, ఇతర కారణాలతో ఫైర్ ఆక్సిడెంట్ అయితే..ప్రత్యేక రక్షణ వ్యవస్థను ఏర్పాటు చేశారు. రూ. 2.5 కోట్ల ఖర్చు అవుతున్న ఈ బస్సులకు ఫేమ్ పథకం కింద కేంద్రం రూ. కోటి సబ్సిడీ అందిస్తోంది. ఈ బస్సుల రాకతో గ్రేటర్ హైదరాబాద్ జోన్‌కు ఏడాదికి రూ. 40 కోట్ల వరకు ఆదా అవుతుందని అంచనా.