హైదరాబాద్ లో ఆర్టీసీ కార్మిక సంఘాల అత్యవసర సమావేశం ముగిసింది. రాష్ట్ర వ్యాప్తంగా కార్మికుల అభిప్రాయాలను జేఏసీ నేతలు తీసుకున్నారు.
హైదరాబాద్ లో ఆర్టీసీ కార్మిక సంఘాల అత్యవసర సమావేశం ముగిసింది. రాష్ట్ర వ్యాప్తంగా కార్మికుల అభిప్రాయాలను జేఏసీ నేతలు తీసుకున్నారు. సమ్మె కొనసాగింపుపై కార్మికులు తర్జనభర్జన పడుతున్నారు. సమ్మె విరమిస్తే ఉద్యోగ భద్రత ఉంటుందా అని ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వం మళ్లీ ఉద్యోగంలోకి తీసుకుంటుందో లేదోనని ఆందోళన చెందుతున్నారు. లేబర్ కోర్టు తేల్చే వరకు సమ్మె కొనసాగించాలని మెజారిటీ కార్మికులు స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. దీంతో ప్రజా బ్యాలెట్ ద్వారా అభిప్రాయం తీసుకోవాలని జేఏసీ నేతలు యోచిస్తున్నట్లు సమాచారం.
సమస్యలు పరిష్కరిస్తామని, సమ్మెను కాల్ ఆఫ్ చేసుకోవాలని ప్రభుత్వం నుంచి ఏమైనా హామీ వస్తే తాము నిర్ణయం తీసుకుంటామని..అప్పటి వరకు సమ్మె యథావిధిగా నడుస్తుందన్నారు. కార్మికుల ఆత్మహత్యలపై సీఎం కేసీఆర్ స్పందన లేదన్నారు. శవాలపై సీఎం పరిపాలన నడుస్తోందన్నారు. సమ్మె కొనసాగుతుందో, ఫుల్ స్టాప్ పడుతుందో అన్న విషయంపై కేసీఆర్ నిర్ణయం తీసుకోవాలన్నారు.
సమ్మెను కొనసాగిస్తామని కార్మికులు చెప్పారు. ఇది చట్ట వ్యతిరేకమైన సమ్మె కాదన్నారు. సీఎం కేసీఆర్ కార్మికులను అణగదొక్కాలని చూస్తున్నారని మండిపడ్డారు. అధికారం చేతిలో తీసుకొని, ఆర్టీసీ ఆస్తులను తీసుకుని నయీం కేసులాగా చేస్తున్నారని చెప్పారు. డిమాండ్ల సాధన కోసం పోరాడుతామని చెబుతున్నారు.