ఈఎస్ఐ మందుల స్కాం : పాత్ర ఉందని తేలితే..శిక్షకు సిద్ధం – శ్రీనివాస్ రెడ్డి

  • Publish Date - September 28, 2019 / 03:01 AM IST

ఈఎస్‌ఐ మందుల కుంభకోణంలో మాజీ మంత్రి నాయిని నర్సింహారెడ్డి అల్లుడు శ్రీనివాసరెడ్డి పేరు, మంత్రి కార్యాలయంలో అధికారులుగా పనిచేసిన వారి మరికొందరి పేర్లు వినిపిస్తున్నాయి. రాజకీయ పార్టీలు, మాజీ అధికారుల పాత్ర ఉన్నట్టు ఆరోపణలు వస్తున్నాయి. స్కామ్‌పై సమగ్ర విచారణ అవసరమని పలువురు కోరుతున్నారు. అయితే తనపై వస్తోన్న ఆరోపణలను నాయిని అల్లుడు, రాంనగర్‌ డివిజన్‌ కార్పొరేటర్‌ శ్రీనివాస్‌రెడ్డి ఖండించారు.

నాయిని మంత్రిగా కొనసాగిన సమయంలో ఈఎస్‌ఐ మందుల కొనుగోలు ఆర్డర్‌ ఇప్పించినట్లు వచ్చిన ఆరోపణలు అవాస్తవమన్నారు. తాను ఈఎస్‌ఐ కంపెనీ కార్మిక సంఘం అధ్యక్షుడిగా పని చేయలేదన్నారు. తన పాత్ర ఉందని తేలితే తాను ఏ శిక్షకైనా సిద్ధమని సవాల్‌ విసిరారు. కొంత మంది వ్యక్తులు కావాలనే తనపై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు.

ఇదిలా ఉంటే..ఏసీబీ తనిఖీల్లో కీలక విషయాలు వెలుగుచూశాయి. మేడ్చల్‌ జాయింట్‌ డైరెక్టర్‌ కార్యాలయంలో ఎలాంటి స్టాక్‌ లేదని విచారణలో తేలింది. పటాన్‌చెరు, బోరబండ డిస్పెన్సరీలకు మేడ్చల్‌ జేడీ ఆఫీస్‌ నుంచి ఎలాంటి మందులు సరఫరాకాలేదని వెల్లడైంది. నకిలీ ఇండెంట్లను సృష్టించి, రికార్డులు పక్కాగా నిర్వహించారు. మేడ్చల్‌ నుంచి పటాన్‌చెరువు, బోరబండకు మందులు సరఫరా చేసినట్లు రికార్డుల్లో పొందుపర్చారు. పాత ఇండెంట్లను కలర్‌ జిరాక్స్‌ తీసి అందులో ఉన్న మందులు, అంకెల్ని మార్చి ఫోర్జరీ ద్వారా కొత్త ఇండెంట్లుగా చూపించారు. వెయ్యి మందు గోలీలు అవసరమని ఇండెంట్‌ వస్తే దాన్ని 80 వేలుగా మార్చివేశారు. వందల కోట్ల కుంభకోణంలో సీనియర్‌ ఐఏఎస్‌ చక్రం తిప్పినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. 

మరోవైపు ఈ స్కాంలో అరెస్టులు కొనసాగుతున్నాయి. డైరెక్టర్‌ దేవికారాణిని ఏసీబీ అధికారులు అరెస్ట్‌ చేశారు. ఆమెతో ఈ కేసులో ప్రమేయమున్న ఏడుగురిని కూడా అదుపులోకి తీసుకున్నారు. రిమాండ్ రిపోర్ట్‌లో సంచలన విషయాలు వెలుగు చూస్తున్నాయి. 44 పేజీల రిమాండ్ డైరీలో దేవికారాణి, పద్మ, వసంతలు కలిసి స్కాం చేసినట్లు ఏసీబీ అధికారులు పేర్కొన్నారు. డిస్పెన్సరీ నుంచి డిమాండ్ లేకపోయినా మందుల కొనుగోళ్లు జరిపినట్లు… మందులను థర్డ్ పార్టీ నుంచి కొనుగోలు చేసినట్లుగా నకిలీ బిల్లులు పెట్టినట్లు గుర్తించారు. మందుల్ని కొనుగోలు చేసినట్లు నకిలీ బిల్లులు సృష్టించి 11 కోట్లు దోచుకున్నట్లు ఏసీబీ రిమాండ్‌ రిపోర్ట్‌లో తెలిపింది.
Read More : ఈఎస్ఐ కేటుగాళ్లు : 10tv ఎక్స్‌క్లూజివ్ ఆడియో క్లిప్స్