కాంగ్రెస్ వీరవిధేయుడు జంప్: బీజేపీలోకి మాజీ ఎంపీ

  • Publish Date - April 4, 2019 / 08:34 AM IST

ముందస్తు తెలంగాణ ఎన్నికల్లో ఇప్పటికే చతికిలపడిన కాంగ్రెస్.. పార్లమెంటు ఎన్నికల వేళ నేతలను దూరం చేసుకుంటూ మరింత ఇబ్బందుల్లో కూరుకుపోతుంది. తెలంగాణ కాంగ్రెస్ ముఖ్యనేత మాజీ ఎంపీ రాపోలు ఆనంద భాస్కర్ కూడా కాంగ్రెస్‌కు గుడ్‌బై చెప్పేశారు. రాపోలు ఆనంద భాస్కర్..  ఢిల్లీలో కేంద్రమంత్రి జేపి నడ్డా సమక్షంలో బీజేపీ పార్టీలో చేరారు. కాంగ్రెస్ పార్టీకి వీరవిధేయుడుగా ఉన్న రాపోలుకు ఒకానొక దశలో సోనియాగాంధీ నేరుగా పిలిచి రాజ్యసభ సీటు ఇచ్చింది. అయితే రాపోలు కాంగ్రెస్‌కు దూరమై బీజేపీలో చేరడం ఊహించని పరిణామం అని అంటున్నారు.

ఈ సంధర్భంగా మాట్లాడిన రాపోలు.. పార్టీలోఎంత నిబద్దతతో పనిచేసినా తన పట్ల నిర్లక్ష్య వైఖరితోనే వ్యవహరించిన కారణంగానే పార్టీ వీడుతున్నట్లు చెప్పారు. పార్టీ విధేయులను మరిచి ఏకపక్షంగా కాంగ్రెస్‌ పార్టీ నేతలు నిర్ణయాలు తీసుకుంటున్నారని విమర్శించారు. ఇదిలా ఉంటే కాంగ్రెస్ పార్టీ ఏఐసీసి కార్యదర్శి, మాజీ ఎంఎల్‌సీ పోంగులేటీ సుధాకర్ రెడ్డితో పాటు పార్టీ మరో సీనియర్ నేత డీకే అరుణ సైతం ఇటీవల బీజేపీ కండువా కప్పుకున్న సంగతి తెలిసిందే.