హెచ్చరిక : 3 రోజులు ఎండలు మండుతాయ్

  • Publish Date - March 14, 2019 / 12:58 AM IST

సాధారణం కన్నా 3-4 డిగ్రీలు అధికమయ్యే ఛాన్స్?
రాజన్న సిరిసిల్ల జిల్లాలో 40.1 డిగ్రీల నమోదు. 
హైదరాబాద్ జిల్లాలో 38.2 డిగ్రీలు. 

రాష్ట్రంలో సూర్యుడు సెగలు పుట్టిస్తున్నాడు. మార్చి రెండో వారంలో ఉష్ణోగ్రతలు గరిష్టంగా నమోదవుతున్నాయి. ఉక్కపోతతో జనం అల్లాడుతున్నారు. ఎండ తీవ్రతకు తట్టుకోలేకపోతున్నారు. సాధారణం కన్నా అధికంగా నమోదవుతున్నాయి. మార్చి 14వ తేదీ గురువారం నుండి మార్చి 16వ తేదీ శనివారం వరకు పలు జిల్లాల్లో 4 డిగ్రీల ఉష్ణోగ్రతలు రికార్డవుతాయని హైదరాబాద్ వాతావరణ శాఖ పేర్కొంది. నల్గొండ, సూర్యాపేట, కొమరం భీమ్, ఆసిఫాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, జగిత్యాలలో ఎండలు అధికంగా ఉంటాయని తెలిపింది. ఇప్పటికే 36 నుండి 41 డిగ్రీలు ప్రాంతాలున్న ప్రాంతాల్లో ఈ పరిస్థితి ఉండొచ్చని అంచనా వేసింది.

ఇక రాష్ట్ర వ్యాప్తంగా రాత్రి పూట టెంపరేచర్స్ అధికంగా నమోదవుతున్నాయి. రానున్న రోజుల్లో రెండు నుండి మూడు డిగ్రీలు పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖాధికారులు హెచ్చరించారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వేములవాడ, రుద్రంగి మండలాల్లో మార్చి 13వ తేదీ బుధవారం గరిష్టంగా 40.1 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. మెదక్ జిల్లాల్లో మాత్రం సాధారణం కన్నా 3.2 డిగ్రీలు పెరిగి 39.3 డిగ్రీలు, హైదరాబాద్ నగరంలో 37 డిగ్రీలు నమోదయ్యాయి. ఆదిలాబాద్‌లో జిల్లాలో 38.3, నిజామాబాద్ జిల్లాలో 38.5, భద్రాచలంలో 38.0, రామగుండంలో 37.6, నల్గొండలో 37.4, హన్మకొండలో 36 డిగ్రీల సెల్సియస్ చొప్పున ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.