అమెరికాలో వీసా మోసాలు, అక్రమంగా ఉద్యోగాలు చేయటంపై 200 మంది ఇండియన్స్ అరెస్ట్ అయ్యారు. తెలుగోళ్లు 20 మంది వరకు ఉన్నట్లు సమాచారం. అమెరికా దేశవ్యాప్తంగా 600 మందిని అదుపులోకి తీసుకుంటే.. వీరిలో కొందరిని విచారించి వదిలేశారు. 200 మంది ఇండియన్ స్టూడెంట్స్ ఇప్పటికీ ఆయా రాష్ట్రాల పోలీస్ స్టేషన్లలో ఉన్నారు. వీసా మోసాలు, అక్రమ ఉద్యోగాల్లో ఇండియన్స్ ఎలా దొరికారు.. ఎందుకు ఇలా చేశారు.. అరెస్ట్ అయిన స్టూడెంట్స్ ఏం చేశారు అనేది చూద్దాం…
అండర్ కవర్ ఆపరేషన్ – పేపర్ ఛేజ్ :
అమెరికాలో అక్రమ వలసదారులను వలపన్ని పట్టుకోవటానికి అమెరికా డిపార్ట్ మెంట్ ఆప్ హోమ్ ల్యాండ్ సెక్యూరిటీ అండర్ కవర్ ఆపరేషన్ చేపట్టింది. దాని పేరు పేపర్ ఛేజ్. అండర్ కవర్ ఆపరేషన్ లో భాగంగా అక్రమ వలసదారుల్ని గుర్తించడానికి హోంల్యాండ్ సెక్యూరిటీ అధికారులే ఏకంగా యూనివర్శిటీ ఆఫ్ ఫార్మింగ్టన్ అనే ఓ నకిలీ విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేశారు. ఈ యూనివర్శిటీకి ప్రొఫెషనల్ వెబ్ సైట్ కూడా ఉంది. నార్త్ వెస్ట్రన్ హైవేపై ఓ కమర్షియల్ బిల్డింగ్ లో ఈ యూనివర్శిటీ ఏర్పాటైంది.
ఫేక్ వర్సిటీ ఆఫర్ చేసిన కోర్సులు :
2015లో ఏర్పాటైన ఈ వర్శిటీలో 2017 నుంచి అధికారులు మారువేషాల్లో ఉద్యోగులుగా చేరారు. BBA-అకౌంటింగ్, BBA-ఫినాన్స్,BBA-ఇంటర్నేషనల్ బిజినెస్, BBA-సప్లయి చైన్ మేనేజ్ మెంట్, BBA- పబ్లిక్ రిలేషన్స్ అండ్ మార్కెటింగ్, BBA- బిజినెస్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్, BS-కంప్యూటర్ సైన్స్, BS-ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ,BS- ఇండస్ట్రియల్ అండ్ సిస్టమ్స్ ఇంజనీరింగ్, BS-మ్యానుఫ్యాక్చరింగ్ ఇంజనీరింగ్, BS-మెకట్రోనిక్స్ కోర్సులను ఆఫర్ చేస్తున్నట్లు ప్రకటించారు. ఇమిగ్రేషన్ అక్రమాలు చేస్తున్న వాళ్ల కోసం అధికారులు మారువేషాల్లో వలపన్నారు. పే టు స్టే స్కీమ్ లో భాగంగా విదేశీ విద్యార్థులు ఈ యూనివర్శిటీని ఎంచుకొన్నారు.
నెల రోజుల క్రితం దేశంలో అక్రమంగా నివసిస్తున్నవారిపై కఠిన చర్యలకు అధ్యక్షుడు ట్రంప్ ఇచ్చిన ఆదేశాలతో జనవరి 30వ తేదీ బుధవారం యూఎస్ ఇమ్మిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్ ఫోర్స్ మెంట్ అధికారులు రంగంలోకి దిగారు. అక్రమంగా అడ్మిషన్ పొంది.. నకిలీ పత్రాలతో అమెరికాలో ఉంటున్న 8 మంది తెలుగు విద్యార్థులను అరెస్ట్ చేశారు. యూనివర్శిటీ ఫేక్ అన్న సంగతి తెలియక వీరందరూ అమెరికాలో వందల మంది విదేశీయులకు.. అక్రమంగా అమెరికాలో విద్యార్థులుగా ఉండేందుకు సాయం చేశారని అధికారులు తెలిపారు. వీరందరినీ డెట్రాయిట్ పోలీస్ స్టేషన్ కి తరలించి విచారిస్తున్నారు.
అయితే అధికారులే ఫేక్ యూనివర్శిటీని ఏర్పాటు చేయడం ఇదే మొదటిసారి కాదు. 2016లో కూడా యూనివర్శిటీ ఆప్ నార్తన్ న్యూజెర్సీని కూడా ఏర్పాటు చేసి 21 మంది విద్యార్థులను అరెస్ట్ చేశారు.