పొంచి ఉన్న హుస్సేన్ సాగర్ ముప్పు, అప్రమత్తమైన అధికారులు, ఆ ప్రాంతాల ప్రజలకు హెచ్చరికలు

  • Publish Date - August 16, 2020 / 01:56 PM IST

హైదరాబాద్ లో మూడు రోజులుగా కుండపోత వర్షం కురుస్తోంది. దీంతో నగరం నడిబొడ్డున ఉన్న హుస్సేన్ సాగర్ కు భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. హుస్సేన్ సాగర్ పూర్తి స్తాయి నీటిమట్టం 514 అడుగులు. ప్రస్తుతం సాగర్ నిండుకుండలా మారింది. వరద పరిస్థితిని ఎప్పటికప్పుడు అంచనా వేస్తున్న అధికారులు వరద ఉధృతి పెరిగితే నీటిని దిగువకు వదిలే అవకాశం ఉంది. ముందస్తుగా హుస్సేన్ సాగర్ దిగువ ప్రాంతాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు.



అశోక్ నగర్, హబ్సిగూడ, నల్లకుంట ఏరియాలోకి వరద నీరు వెళ్లే అవకాశం:
మరోవైపు లుంబిని పార్కులోకి సైతం వరదనీరు వచ్చి చేరుతోంది. ఇవాళ(ఆగస్టు 16,2020) హుస్సేన్ సాగర్ గేట్లను ఎత్తివేసే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. దాంతో సాగర్ చుట్టుపక్కల వారు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని అధికారులు అప్రమత్తం చేసారు. అశోక్ నగర్, హబ్సిగూడ, నల్లకుంట ఏరియాలోకి వరద నీరు వెళ్లే అవకాశాలున్నాయని అధికారులు చెబుతున్నారు. ఆగకుండా కురుస్తున్న వర్షాలతో హుస్సేన్ సాగర్ కు వరద ఉదృతి మరింత పెరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.



వరద నీరు ఎప్పటికప్పుడు బయటకు వెళ్ళేలా ఏర్పాట్లు:
హుస్సేన్ సాగర్ లో చేరిన వరద నీరు ఎప్పటికప్పుడు బయటకు వెళ్ళేలా రెండు అలుగులు, ఒక తూమును ఓపెన్ చేశారు. అలుగులు, తూముకు అడ్డుపడుతున్న చెత్తా చెదారాన్ని క్లీన్ టెక్ మిషన్, సిబ్బందితో ఎప్పటికప్పుడు తొలగిస్తున్నారు. నగరవ్యాప్తంగా నిరంతరం పనిచేస్తున్న మాన్సూన్ ఎమర్జెన్సీ, డీఆర్ఎఫ్ బృందాలు, అధికారులను జీహెచ్ఎంసీ అప్రమత్తం చేసింది. గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని కాలువ వెంట ఉన్న వారిని అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు.



మరో రెండు రోజులు భారీ వర్షాలు:
వాయువ్య బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం ప్రభావంతో హైదరాబాద్‌లో మూడు రోజులుగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఎడతెరిపిలేని వానలతో నగరంలోని ప్రధాన రహదారులపై వర్షపునీరు నిలిచిపోయింది. లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. అల్పపీడనం ప్రభావంతో మరో రెండు రోజులు విస్తారంగా వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఉత్తర బంగాళాఖాతంలో సుమారుగా ఆగస్టు 19వ తేదీన అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నట్టు హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ ప్రభావంతో తెలంగాణలో నిన్న(ఆగస్టు 15,2020) ఒకటి రెండు చోట్ల అతి భారీ వర్షాలతో పాటు అత్యంత భారీ వర్షాలు కురిశాయి. నేడు(ఆగస్టు 16,2020) ఒకటి రెండు చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు, రేపు(ఆగస్టు 17,2020) ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు.



ట్రెండింగ్ వార్తలు