గణేశ్ నిమజ్జనానికి హైదరాబాద్ సిద్ధమైంది. హుస్సేన్ సాగర్‌తో పాటు పలు చెరువులు ఏకదంతుడిని తమ ఒడిలో చేర్చుకునేందుకు రెడీ అయ్యాయి. అటు.. భాగ్యనగర్ గణేశ్ ఉత్సవ సమితి, అటు GHMC అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. విగ్రహాల నిమజ్జనానికి, భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా సర్వం సిద్ధం చేశారు.
బాలాపూర్ గణేశ్ మొదలుకొని, ఖైరతాబాద్ వినాయకుడు సహా వేలాది లంబోదరులు సెప్టెంబర్ 12వ తేదీ గురువారం గంగమ్మ ఒడికి చేరనున్నారు. భాగ్యనగరంలో వినాయక నవరాత్రులు మొదలైన మూడో రోజు నుంచే ప్రారంభమైన నిమజ్జనం ఘట్టం నేటితో పూర్తి కానుంది. ఈ క్రమంలో ప్రభుత్వ శాఖల అధికారులు అలర్టయ్యారు. గణేశ్ నిమజ్జనం సవ్యంగా, సాఫీగా సాగేలా అన్ని ఏర్పాట్లు చేశారు.
గ్రేటర్ పరిధిలో మొత్తం 70వేలకు పైగా విగ్రహాలు నెలకొల్పగా… ఇప్పటివరకు 17వేల విగ్రహాలు నిమజ్జనమయ్యాయి. మిగిలిన 55వేల విగ్రహాలు నిమజ్జనానికి తరలివెళ్లనున్నాయి. ఇందుకోసం హుస్సేన్ సాగర్ వద్ద ఇప్పటికే ఏర్పాట్లు పూర్తయ్యాయి. నగరంలోని పలు చెరువులను కూడా అధికారులు సిద్ధం చేశారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో మొత్తం 20కోట్ల రూపాయలు వెచ్చించి విస్తృత ఏర్పాట్లు చేశారు. నగరం నలుమూలలా సాగే వినాయక శోభాయాత్రను తొలిసారిగా గూగుల్ మ్యాప్ ద్వారా వీక్షించే అవకాశాన్ని కల్పించారు. శోభాయాత్రను ఎప్పటికప్పుడూ అప్‌డేట్ చేయడం ద్వారా ఆన్‌లైన్‌లో పరిస్థితిని పర్యవేక్షించనున్నారు.హైదరాబాద్‌లో 391 కిలోమీటర్ల మేర గణేశ్ నిమజ్జన శోభాయాత్ర కొనసాగనుంది. ప్రశాంతంగా జరిగేలా జీహెచ్‌ఎంసీ అధికారులు, పోలీస్ శాఖ, జలమండలి, శానిటేషన్ తదితర ప్రభుత్వ విభాగాల సిబ్బంది కృషి చేస్తున్నారు.
> ప్రతి మూడు కిలోమీటర్లకు ఒకటి చొప్పున మొత్తం 194 యాక్షన్ టీమ్స్‌ను సిద్ధం చేశారు. ఒక్కో టీమ్‌లో శానిటరీ సూపర్ వైజర్, ముగ్గురు ఎస్ఎఫ్‌ఏలు, 21 పారిశుద్ధ్య కార్మికులు ఉంటారు.
> 481మంది సూపర్‌వైజర్లు, 719మంది ఎస్ఎఫ్‌ఏలు, 9వేల 849మంది పారిశుద్ధ్య కార్మికులు… మూడు షిఫ్టుల్లో పనిచేస్తారు.
> నిమజ్జన ప్రాంతాల్లో 134 మొబైల్ క్రేన్లతో పాటు 93 స్టాటిక్ క్రేన్లను ఏర్పాటు చేశారు.
> 27 వైద్య శిబిరాలతోపాటు భద్రత నిమిత్తం గజ ఈతగాళ్లను అందుబాటులో ఉంచుతున్నారు.
> పర్యాటక శాఖ ద్వారా హుసేన్ సాగర్‌లో 7 పెద్ద బోట్లు, 4 స్పీడ్ బోట్లతోపాటు పదిమంది గజ ఈత గాళ్లను సిద్ధం చేశారు.
> సరూర్‌నగర్, కాప్రా, ప్రగతినగర్ చెరువుల దగ్గర ప్రత్యేకంగా 3 బోట్లు ఏర్పాటు చేశారు.
> ట్యాంక్‌బండ్, హుస్సేన్ సాగర్, సరూర్‌నగర్ మినీ ట్యాంక్ బండ్ దగ్గర కేంద్ర విపత్తు నివారణ దళాల సేవలందించనున్నాయి.
> నిమజ్జనం జరిగే 32 ప్రాంతాల్లో సందర్శకుల కోసం 92 మొబైల్ టాయ్‌లెట్లు ఏర్పాటు చేశారు.
> జలమండలి ఆధ్వర్యంలో 115 వాటర్ క్యాంప్‌లను ఏర్పాటు చేసి…30 లక్షలకు పైగా వాటర్ ప్యాకెట్లు సిద్ధం చేశారు.
> హుస్సేన్ సాగర్‌లో వ్యర్థాలు ఎప్పటికప్పుడు తొలగించేందుకు వెయ్యి మందిని నియమించారు.
> 2100 మంది ట్రాఫిక్ సిబ్బంది నిమజ్జనం కోసం డ్యూటీ చేయనున్నారు.
> ఆర్టీసీ కూడా నిమజ్జనం కోసం 550 స్పెషల్ బస్సులను నడపనుంది.
> 75 జనరేటర్లతోపాటు హుస్సేన్ సాగర్ చుట్టూ 48 విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్లు, సరూర్‌నగర్ చెరువు వద్ద 5 ట్రాన్స్‌ఫార్మర్లను ఏర్పాటు చేసింది.
> నగరంలో నిరంతర విద్యుత్ సరఫరాకు 101 అదనపు ట్రాన్స్‌ఫార్మర్లను అందుబాటులో ఉంచింది.
> నిమజ్జన మార్గాల్లో 37,674 అదనపు లైట్లను ఏర్పాటు చేసింది.
> జీహెచ్‌ఎంసీ విద్యుత్ విభాగం కూడా 36,674 తాత్కాలిక లైట్లను ఏర్పాటు చేసింది.
> శోభాయాత్ర మార్గంలో 36 ఫైరింజన్లను అందుబాటులో ఉంచారు.