సిలిండర్ బాంబు : కాప్రాలో ఇద్దరు మ‌ృతి

  • Publish Date - January 18, 2019 / 04:00 AM IST

హైదరాబాద్ : కాప్రా ఉలిక్కి పడింది. గ్యాస్ సిలిండర్ పేలడంతో ఇద్దరు మృతి చెందారు. ఈ ఘటనతో స్థానికులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. భవనం ఇంటిపై కప్పు…సగ భాగం ధ్వంసమైంది. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా ప్రదేశానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన 8మందిని సమీప ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వీరిలో ఇద్దరి పరిస్థితి సీరియస్‌గా ఉంది. 
వివరాల్లోకి వెళితే….మేడ్చల్ జిల్లా కాప్రాలోని ఓ బిల్డింగ్ ఉంది. ఇక్కడ ఒకతను గోల్డ్ షాప్ పెట్టేందుకు ఏర్పాట్లు చేస్తున్నాడు. ఈ ఇంట్లో గోవింద్ (12), నిఖిత (10) మోహన్‌లాల్ (52), నీలా (45)ఉంటున్నారు. 2019, జనవరి 18వ తేదీ ఉదయం ఈ ఇంట్లో పేలుడు సంభవంచింది. గ్యాస్ ఆన్ చేస్తుండంతో పేలుడు సంభవించిందని తెలుస్తోంది. పేలుడు ధాటికి భవనం ఓ భాగం కుప్పకూలిపోయింది. భారీ పేలుడు శబ్ధం రావడంతో స్థానికులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. భవన శిథిలాలు రోడ్డుపై వెళుతున్న వారిపై పడ్డాయి. రవి అనే వ్యక్తికి రాయి బలంగా తాకడంతో అక్కడికక్కడనే కుప్పకూలి చనిపోయాడు. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడకు చేరుకున్నారు. శిథిలాల కింద ఎవరైనా ఉన్నారా ? అనేది పరిశీలించారు. గాయాలైన 8 మందిని సమీప ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. 
పేలుడు ధాటి ఎలా ఉందంటే కిలోమీటర్ పరిధిలో ఉన్న నివాసాల అద్దాలు పగిలిపోయాయి. ఒక్క సిలిండర్ పేలితే ఇంత తీవ్రత ఉంటుందా ? అనే అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. పేలుడు పదార్థాలు ఏమైనా ఉంచారా ? అనే దానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు.