RV Karnan: కేబీఆర్ చుట్టూ శాశ్వత వన్-వే.. హెచ్-సిటీ ప్రాజెక్ట్ రద్దు.. జీహెచ్‌ఎంసీ కమిషనర్ సంచలన నిర్ణయం
హైదరాబాద్ కేబీఆర్ పార్క్, జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్ (RV Karnan)ప్రాంతాల్లో ట్రాఫిక్ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపేందుకు జీహెచ్‌ఎంసీ ప్రత్యేక ప్రణాళికలు సిద్ధం చేసింది.
- V Santhosh Kumar
- Updated on- October 5, 2026 / 02:31 PM IST
GHMC cancels H-City project around KBR Park.
RV Karnan: హైదరాబాద్ నగరంలో ఎంతో రద్దీగా ఉండే కేబీఆర్ పార్క్, జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్ ప్రాంతాల్లో ట్రాఫిక్ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపేందుకు జీహెచ్‌ఎంసీ ప్రత్యేక ప్రణాళికలు సిద్ధం చేసింది. ఇందులో భాగంగా కేబీఆర్ పార్క్, జూబ్లీహిల్స్ చెక్‌పోస్టు మార్గాన్ని జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్ (RV Karnan)క్షేత్రస్థాయిలో స్వయంగా పరిశీలించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ నగరవాసులకు, వాహనదారులకు మేలు చేకూరేలా కీలక నిర్ణయాలను వెల్లడించారు. గతంలో ప్రతిపాదించిన హెచ్-సిటీ పనులను పూర్తిగా రద్దు చేసినట్లు ఆయన స్పష్టం చేశారు. ఈ నిర్ణయం వల్ల ప్రభుత్వానికి ఏకంగా రూ.400 కోట్ల ప్రజాధనం ఆదా అవుతుందని ఆయన తెలిపారు.
కేబీఆర్ పార్క్ చుట్టూ శాశ్వతంగా వన్-వే విధానం:
కేబీఆర్ పార్క్ చుట్టూ ప్రస్తుతం అమలులో ఉన్న వన్-వే విధానం విజయవంతం కావడంతో, దానినే శాశ్వతంగా కొనసాగించాలని అధికారులు ప్రాథమికంగా నిర్ణయించారు. ఈ మార్గంలో వాహనాలు సజావుగా సాగేలా చూడటంతో పాటు, ప్రమాదాలను అరికట్టడానికి ఈ వన్-వే నిబంధన ఎంతగానో దోహదపడుతోందని కమిషనర్ పేర్కొన్నారు. పార్కు పర్యావరణ పరిరక్షణను దృష్టిలో ఉంచుకుని ఈ ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకున్నట్లు తెలిపారు.
స్టీల్ బ్రిడ్జి, అండర్‌పాస్ నిర్మాణాలు:
ట్రాఫిక్ రద్దీని పూర్తిగా నివారించేందుకు నాగార్జున సర్కిల్ నుంచి జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్ వరకు 6 లైన్లతో అత్యాధునిక స్టీల్ బ్రిడ్జి నిర్మాణాన్ని చేపట్టబోతున్నట్లు ఆర్వీ కర్ణన్ ప్రకటించారు. ఈ నిర్మాణ పనులను వేగవంతం చేసి వచ్చే ఏడాది నాటికి పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తెస్తామని ధీమా వ్యక్తం చేశారు. దీనితో పాటు కేబీఆర్ పార్క్ సమీపంలో ప్రయాణికుల రవాణా సులభతరం చేసేందుకు ఓ అండర్‌పాస్‌ను కూడా నిర్మిస్తున్నట్లు వివరించారు.
