KBR Park Traffic: కేబీఆర్ పార్క్ ట్రాఫిక్ ప్లాన్ చేంజ్.. 7 అండర్‌పాస్‌లు, బ్రిడ్జిలు రద్దు.. భారీ గుంతలు పూడ్చివేత!
హైదరాబాద్ కేబీఆర్ పార్క్(KBR Park Traffic) చుట్టూ ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి రూపొందించిన అండర్‌పాస్‌లు, స్టీల్ బ్రిడ్జిల నిర్మాణ ప్రణాళికకు అధికారులు స్వస్తి పలికారు.
Telangana government scraps new traffic plan around KBR Park.
KBR Park Traffic: హైదరాబాద్‌లోని ప్రముఖ కేబీఆర్ పార్క్ చుట్టూ పేరుకుపోతున్న తీవ్ర ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి గతంలో రూపొందించిన అండర్‌పాస్‌లు, స్టీల్ బ్రిడ్జిల నిర్మాణ ప్రణాళికకు అధికారులు స్వస్తి పలికారు. ఈ ప్రాజెక్టులో భాగంగా గతంలో ప్రతిపాదించిన పనుల కోసం తవ్విన భారీ గుంతలను ప్రస్తుతం అధికారులు మట్టితో పూడ్చివేసే ప్రక్రియను వేగవంతం చేశారు. కేబీఆర్ పార్క్ చుట్టూ అమలు చేస్తున్న వన్‌వే విధానం సత్ఫలితాలనివ్వడం, భారీ భూసేకరణ ఖర్చులను తగ్గించుకోవాలనే ఉద్దేశంతో పాత మాస్టర్ ప్లాన్‌ను పునఃపరిశీలించి ఈ నిర్ణయం తీసుకున్నారు.
గుంతల పూడ్చివేత పనులు.. పాత పిల్లర్ల పునర్వినియోగం:
అగ్రసేన్ మహారాజ్ జంక్షన్, పార్క్ పరిసర ప్రాంతాల్లో అండర్‌పాస్ నిర్మాణం కోసం తవ్విన రెండు భారీ గుంతలను ప్రస్తుతం ట్రాక్టర్లు, ట్రక్కుల సాయంతో పూర్తిస్థాయిలో పూడ్చివేస్తున్నారు. ఈ గుంతలను సమాంతరం చేసిన అనంతరం సదరు స్థలాన్ని సాధారణ రహదారి అభివృద్ధికి (KBR Park Traffic)అనుగుణంగా మార్చనున్నారు. మరోవైపు, గతంలో పార్క్ హయత్, కేబీఆర్ పార్క్ మెయిన్ గేట్ వద్ద నిర్మించిన పిల్లర్లను వృథా చేయకుండా, రాబోయే కొత్త రవాణా ప్రాజెక్టు నిర్మాణాల్లోనే సమర్థవంతంగా వినియోగించుకోవాలని జీహెచ్ఎంసీ అధికారులు భావిస్తున్నారు.
రూ.751 కోట్లతో కొత్త ఎలివేటెడ్ కారిడార్.. గణనీయంగా తగ్గనున్న భూసేకరణ భారం:
పాత ప్రణాళిక రద్దుతో బంజారాహిల్స్ ముజఫర్కా కాలేజ్ నుంచి జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్ వరకు సుమారు 4 కిలోమీటర్ల మేర ఆరు లేన్ల బైడైరెక్షనల్ ఎలివేటెడ్ కారిడార్ నిర్మించేందుకు కొత్త ప్రణాళిక సిద్ధం చేశారు. రూ.751 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టనున్న ఈ ప్రాజెక్ట్ వల్ల భూసేకరణ ఖర్చు రూ.1,040 కోట్ల నుంచి ఏకంగా రూ.300 కోట్లలోపు పడిపోనుంది. ఇది స్థలభావంతో పాటు ప్రాజెక్టు వ్యయాన్ని బాగా నియంత్రించనుంది.
