ఈవీఎం వద్దు బ్యాలెట్ ముద్దు.. బ్యాలెట్ పద్దతిలోనే జీహెచ్ఎంసీ ఎన్నికలు, ఎన్నికల సంఘం కీలక నిర్ణయం

  • Publish Date - October 5, 2020 / 04:16 PM IST

ghmc elections: త్వరలోనే జీహెచ్ఎంసీ ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. కరోనా నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. బ్యాలెట్ పద్దతిలోనే జీహెచ్ఎంసీ ఎన్నికలు నిర్వహించాలని ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకుంది. అన్ని పార్టీల అభిప్రాయం తీసుకున్నాకే ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఎస్ఈసీ తెలిపింది.

త్వరలో జరగనున్న గ్రేటర్‌ హైదరాబాద్‌ మునిపల్‌ కార్పొరేషన్‌ (జీహెచ్‌ఎంసీ) ఎన్నికలను బ్యాలెట్‌తో నిర్వహించడానికే ఎక్కువ పార్టీలు మొగ్గు చూపాయి. ఈవీఎంలతో నిర్వహిస్తే సాంకేతిక సమస్యలు తలెత్తే అవకాశాలుంటాయని, వాటిని అంతగా విశ్వసించలేమని అభిప్రాయపడ్డాయి. అధికార టీఆర్‌ఎస్ తో పాటు సీపీఐ, సీపీఎం, టీడీపీలు బ్యాలెట్‌ పద్ధతినే కోరుకున్నాయి. బీజేపీ మాత్రం ఈవీఎంలతోనే ఎన్నికలు నిర్వహించాలంటూ పట్టుబట్టింది. ఈ మేరకు రాష్ట్రంలోని ఆయా రాజకీయ పార్టీల నుంచి రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ (ఎస్‌ఈసీ) అభిప్రాయాలను సేకరించింది.

2021 జనవరిలోగా జీహెచ్‌ఎంసీ ఎన్నికలను నిర్వహించాల్సి ఉన్న సంగతి తెలిసిందే. దీనికోసం ఓటర్ల జాబితాను సిద్ధం చేయడంతో పాటు, ఎన్నికలను బ్యాలెట్‌ పద్ధతిన నిర్వహించాలా? ఈవీఎంలతో నిర్వహించాలా? అనేదానిపై ఎస్‌ఈసీ కసరత్తు చేసింది. కొత్తగా నియమితులైన రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ సి.పార్థసారధి ఆయా పార్టీల అభిప్రాయాలను తీసుకున్నారు.