అంత్యక్రియల డబ్బుని కూడా వదలని ప్రభుత్వ ఉద్యోగి.. రూ.20వేల చెక్కుకి రూ.10వేల లంచం డిమాండ్

GHMC Superintendent demands bribe: ప్రభుత్వ ఉద్యోగులు కొందరు మరీ దిగజారి పోతున్నారు. నెల నెల ప్రభుత్వం జీతం ఇస్తున్నా.. కక్కుర్తి పడుతున్నారు. లంచానికి రుచి మరిగి నీచంగా ప్రవర్తిస్తున్నారు. చేతులు తడిపితే కానీ పనులు జరగడం లేదు. ఏ పని అయినా, మామూలు ఇస్తేనే అవుతుంది. తాజాగా ఓ ప్రభుత్వ ఉద్యోగి నిర్వాకం అందరిని సిగ్గుపడేలా చేసింది. ఆ అధికారి శవాల మీద చిల్లర ఏరుకునే వాడి తరహాలో వ్యవహరిచాడు. అంత్యక్రియల కోసం రూ.20వేల డబ్బు మంజూరు చేయించడానికి ఏకంగా రూ.10వేల లంచం డిమాండ్ చేశాడు. లంచం తీసుకుంటూ ఏసీబీకి అడ్డంగా దొరికిపోయాడు.

అంత్యక్రియల డబ్బుని కూడా వదల్లేదు:
హైదరాబాద్ మూసారాంబాగ్‌ బ్యాండ్ బస్తీలో నివసించే ఆశయ్య పాతబస్తీ సర్ధార్‌మహల్‌లోని జీహెచ్‌ఎంసీలో కామాటి (కార్మికుడు)గా పనిచేసి పదవీ విరమణ పొందాడు. అనారోగ్యంతో 2013లో చనిపోయాడు. ఆయన భార్య బాలమ్మకు పెన్షన్ వచ్చేది. గతేడాది(2020) మే 15న ఆమె కూడా చనిపోవడంతో కొడుకులు అంత్యక్రియలు పూర్తిచేశారు. అయితే బాలమ్మ అంత్యక్రియలకు జీహెచ్‌ఎంసీ రూ.20 వేలు ఇస్తుందని తెలుసుకున్న చిన్న కుమారుడు క్రాంతికుమార్‌ నెల రోజుల క్రితం చాంద్రాయణగుట్ట నర్కిపూల్‌బాగ్‌లోని జీహెచ్‌ఎంసీ చార్మినార్‌ జోన్‌ కార్యాలయంలోని సర్కిల్‌-10 ఇంజినీరింగ్‌ విభాగం సూపరింటెండెంట్‌ పూల్‌సింగ్‌ను కలిశాడు.

రూ.20వేల చెక్కుకి 10వేలు లంచం:
కాగా, పూల్ సింగ్ లంచం డిమాండ్ చేశాడు. వచ్చే సొమ్ములో తనకు రూ.10వేలు ఇస్తేనే చెక్కు మంజూరు చేస్తానని చెప్పాడు. దీనికి క్రాంతికుమార్ అంగీకరించాడు. రూ.20వేల చెక్కు రావడంతో ఫిబ్రవరి 17న క్రాంతికుమార్‌ కార్యాలయానికి వెళ్లాడు. అయితే మరో 5 వేలు ఇస్తేనే చెక్కు ఇస్తానని పూల్‌సింగ్ మరో డిమాండ్ పెట్టాడు. కంగుతిన్న క్రాంతికుమార్‌ ఇక లాభం లేదనుకుని ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. అధికారుల సూచనతో మంగళవారం(ఫిబ్రవరి 23,2021) రూ.5 వేలు పూల్‌సింగ్‌కు ఇస్తుండగా ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. అనంతరం కర్మన్‌ఘాట్‌లోని పూల్‌సింగ్‌ ఇంట్లోనూ ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు.

జీహెచ్ఎంసీ అధికారి తీరు చర్చనీయాంశంగా మారింది. ప్రభుత్వ ఉద్యోగి అయి ఉండి, నెల నెల జీతం తీసుకుంటూ, మళ్లీ ఇలా లంచాలు డిమాండ్ చేసి వేధించడం దారుణం అని ప్రజలు మండిపడుతున్నారు. ప్రభుత్వ ఉద్యోగుల్లో మార్పు రావాలంటే ఇలాంటి లంచాధికారులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు.

ప్రజలకు ఏసీబీ అధికారులు ఓ సూచన చేశారు. ప్రభుత్వ ఆఫీసుల్లో ఎవరైనా లంచాలు అడిగితే వెంటనే తమ దృష్టికి తీసుకురావాలన్నారు. 1064‌కి సమాచారం ఇవ్వడంతో పాటు 9440446109 నెంబర్ కి కాల్ చేసి ఫిర్యాదు చేయొచ్చన్నారు.

ట్రెండింగ్ వార్తలు