ఫేస్‌బుక్ ద్వారా పరిచయమయ్యారు. ప్రేమించుకుని పెళ్లితో ఒకటి కావాలని అనుకున్నారు. ఇంతలోనే ఓ రోడ్డు ప్రమాదం ఆ ప్రేమికులను విడదీసింది. వివరాల్లోకి వెళ్తే.. సిద్దిపేట జిల్లా కోహెడ మండలం బస్వాపూర్ గ్రామానికి చెందిన దాడి శ్రీకాంత్ హైదరాబాద్‌లో ఉంటూ క్యాటరింగ్ పనిచేస్తున్నారు. మంచిర్యాల జిల్లా జన్నారం మండలం చింతగూడ గ్రామానికి చెందిన మునేసుల అరుణ (19) హైదరాబాద్ నాంపల్లిలో ఉన్న వనితా మహావిద్యాలయంలో బీఎస్సీ సెకెండ్ ఇయర్ చదువుతుంది.
ఫేస్‌బుక్ ద్వారా పరిచయం అయిన వీరిద్దరు ప్రేమించుకున్నారు. పెళ్లి చేసుకోవాలని నిశ్చయించుకున్నారు. పెద్దల అంగీకరించేలా చూడమని కోరుకునేందుకు యాదగిరిగుట్టకు బైక్‌పై బయలుదేరారు. అయితే ఊహించని విధంగా బీబీనగర్ పెద్దచెరువుకట్ట సమీపంలోకి రాగానే జాతీయ రహదారి 163పై హైదరాబాద్-వరంగల్ మార్గంలో బైక్ అదుపుతప్పి కిందపడ్డారు. ఇంతలో వెనుక నుండి వచ్చిన కారు అరుణ తలపై నుంచి వెళ్లడంతో ఆమె అక్కడికక్కడే మరణించింది. హెల్మెట్ పెట్టుకుని ఉండడంతో శ్రీకాంత్ ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.