తెలంగాణలో సద్దుల బతుకమ్మ వేడుకలు 2019, అక్టోబర్ 06వ తేదీ ఆదివారం ఘనంగా జరిగాయి. ఒక్కొక్క పువ్వేసి.. చందమామా.. అంటూ బతుకమ్మ పాటలతో ఆడపడుచులు ఆడిపాడారు. అందంగా అలంకరించిన బతుకమ్మను పూజించిన మహిళలు.. చెరువుల్లో, కాలువల్లో వాటిని వదిలిపెట్టారు. వెళ్లిరా బతుకమ్మ..మళ్లీ రావమ్మా అంటూ బతుకమ్మకు ఘనంగా వీడ్కోలు పలికారు.
హైదరాబాద్ మహానగరంలో బతుకమ్మ సంబరాలు అంబరాన్నంటాయి. వేలాది మంది మహిళలు బతుకమ్మలతో LB స్టేడియం నుంచి ట్యాంక్ బండ్ వరకు శోభాయాత్ర నిర్వహించారు. ఎల్బీ స్టేడియంలో బతుకమ్మలను పేర్చిన మహిళామణులు.. ఆ బతుకమ్మలతో ఊరేగింపుగా ట్యాంక్‌బండ్‌కు చేరుకున్నారు. మరోవైపు ట్యాంక్‌బండ్‌పై ఏర్పాటు చేసిన సాంస్కృతిక, కళా ప్రదర్శనలు విశేషంగా ఆకట్టుకున్నాయి. కళా ప్రదర్శనలు, ఆకాశానంటుతున్న తారాజువ్వలు, బాణాసంచాల మధ్య సద్దుల బతుకమ్మ వేడుక వైభవంగా జరిగింది.
అటు వరంగల్ జిల్లాలోనూ బతుకమ్మ సంబురాలు ఘనంగా జరిగాయి. రంగురంగుల పూలతో పేర్చిన సద్దుల బతుకమ్మలతో సంబురాలు అంబరాన్ని తాకాయి. ఆడపడుచులంతా ఓ చోట చేరి బతుకమ్మలను పేర్చి ఆడిపాడారు. ఈ బతుకమ్మ ముగింపు వేడుకల్లో చిన్నా పెద్దా తేడా లేకుండా అందరూ ఉత్సాహంగా పాల్గొన్నారు. సాంప్రదాయ వస్త్రాలు ధరించి గౌరమ్మకు ఘనంగా పూజలు నిర్వహించి…నిమజ్జనం చేశారు.
కరీంనగర్‌లో బతుకమ్మ ముగింపు వేడుకలు అంబరాన్నంటాయి. జిల్లా వ్యాప్తంగా రంగు రంగుల పూలతో బతుకమ్మలను అందంగా ముస్తాబు చేశారు. వరలక్మీ దేవి టెంపుల్ సమీపంలో బతుకమ్మ ఆటపాటలతో మహిళలు సందడి చేశారు. కోలాటాలు, చప్పట్లతో ఉత్సాహంగా వేడుకలు చేసుకున్నారు.
Read More : తెలంగాణలో ఘనంగా బతుకమ్మ సంబురాలు