తెలంగాణ రాష్ట్రంలో వేసవి ఎండల తీవ్రతను దృష్టిలో పెట్టుకుని ఒంటిపూట బడులను నిర్వహించేందుకు విద్యాశాఖ చర్యలు చేపట్టింది. మార్చి మొదటి వారం నుంచే ప్రారంభించాలని విద్యాశాఖ భావిస్తోంది. వేసవి ఎండల తీవ్రత ఇప్పటికే మొదలైన క్రమంలో ముందుగానే ఒంటిపూట బడులను ప్రారంభించాలని భావిస్తుంది. గత సంవత్సరం మార్చి రెండవ వారంలో ఒంటిపూట బడులను విద్యాశాఖ ప్రారంభించగా.. ఈ ఏడాది మాత్రం ఒక వారం ముందుగా ఒంటిపూట
బడులను ప్రారంభించే యోచనలో విద్యాశాఖ ఉంది. వారం ముందు నుంచే ఈ దిశగా విద్యాశాఖ కసరత్తు చేస్తోంది. ఈసారి ఎండల తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో అకడమిక్ కేలండర్‌లో నిర్ణయించిన ప్రకారం ఏప్రిల్ 12వ తేదీని పాఠశాలలకు చివరి పనిదినం కానుంది. ఏప్రిల్ 13 నుంచి మే 31 వరకు పాఠశాలలకు వేసవి సెలవులుగా విద్యాశాఖ ప్రకటించింది. జూన్ 1 (కొత్త విద్యా సంవత్సరం) నుంచి తిరిగి పాఠశాలలు ప్రారంభం అవుతాయి.