తెలంగాణ రాష్ట్రంలో ఈ ఏడాది (2019) కూడా ఎండలు మండిపోతున్నాయి. పలు జిల్లాల్లో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఎండలకు తోడు వడగాలులు కూడా వీస్తున్నాయి. రాత్రి కూడా గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో పాటు ఉక్కపోత కూడా ఉంటోంది. దీనితో ప్రజలు పలు సమస్యలను ఎదుర్కొంటున్నారు. మార్చి 16వ తేదీ శనివారం సాధారణం కంటే 2 నుండి 3 డిగ్రీల ఉష్ణోగ్రతలు పెరిగినట్లు అంచనా.
గాలిలో తేమ శాతం తగ్గడం వల్ల ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయని హైదరాబాద్ వాతావరణ శాఖ పేర్కొంది. మరో వారం వరకు 3 నుండి 4 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు పెరిగే ఛాన్స్ ఉందని తెలిపింది. కరీంనగర్‌లో అత్యధికంగా 39.6, నాగర్ కర్నూలులో 39.4 డిగ్రీలు, వనపర్తిలో 39.2 డిగ్రీలు, వికారాబాద్, సంగారెడ్డిలో 39.1, హైదరాబాద్‌లో 37.2 డిగ్రీల పగటి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.