నగరం మరోసారి తడిసి ముద్దవుతోంది. ఇప్పటికే పడిన వర్షాలతో నగర వాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్న సంగతి తెలిసిందే. సెప్టెంబర్ 30వ తేదీ సోమవారం మధ్యాహ్నం ఉన్నట్టుండి ఒక్కసారిగా భారీ వర్షం కురిసింది. బేగంపేటలో కురిసిన వర్షానికి రోడ్లపై భారీగా వరద నీరు చేరింది. దీంతో వాహనదారులు, పాదాచారులు తీవ్ర ఇబ్బందులు పడ్డాల్సి వచ్చింది. వర్షం కారణంగా భారీగా ట్రాఫిక్ స్తంభించింది. వానలోనే తడుస్తూ ఇక్కట్లు పడ్డారు.
బంజారాహిల్స్, జూబ్లిహిల్స్, పెద్దమ్మగుడి, అమీర్ పేట, పంజాగుట్ట ప్రాంతాల్లో వర్షం కురిసింది. సికింద్రాబాద్, చిలకలగూడ, పార్సీగుట్ట, సంగీత్, ట్యాంక్ బండ్, హిమాయత్ నగర్ ప్రాంతాల్లో కురిసిన వర్షానికి రోడ్లన్నీ జలమయమయ్యాయి. లోతట్టు ప్రాంతాల్లో వర్షపు నీరు నిలిచిపోయింది. మొన్న కురిసిన వర్షానికి ఇంకా పలు ప్రాంతాల్లో నీరు నిలిచిపోయి ఉంది. తాజాగా పడుతున్న వర్షంతో మరింత ఇబ్బందులు తప్పవని ప్రజలు బెంబెలేత్తిపోతున్నారు.
ఇదిలా ఉంటే వర్షాలపై జీహెచ్ఎంసీ స్పందించింది. ప్రజలు ఇబ్బందులు కలుగకుండా ఏర్పాట్లు చేస్తున్నట్లు వెల్లడించిది. నిలిచిన నీటిని సిబ్బంది తొలగించే ప్రయత్నం చేస్తున్నారని, పాడైన రహదారులకు మరమ్మత్తులు చేపట్టినట్లు తెలిపారు.
మరోవైపు తెలుగు రాష్ట్రాలతో పాటు భారీ వర్షాలు ఉత్తరాదిని వణికిస్తున్నాయి. బీహార్, ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రాలు చిగురుటాకులా వణికిపోతున్నాయి. లోతట్టు ప్రాంతాలు జలదిగ్భందనంలో చిక్కుకున్నాయి. రహదారులపై భారీగా నీరు నిలిచిపోయింది. పదుల సంఖ్యలో మృతి చెందారు. ఎన్డీఆర్ఎఫ్, ఇతర సిబ్బంది సహాయక చర్యలు చేపడుతున్నారు.