అర్ధరాత్రి వేళ : భాగ్యనగరం అతలాకుతలం

  • Publish Date - September 27, 2019 / 01:18 AM IST

అర్ధరాత్రి వేళ హైదరాబాద్‌ నగరాన్ని కుంభవృష్టి అతలాకుతలం చేసింది. వారం రోజుల నుంచి రాత్రిపూట కురుస్తున్న వాన.. నిన్న రాత్రి కూడా దంచి కొట్టింది. రాత్రి 11.30 నుంచి ఎడతెరిపి లేకుండా జడివాన మొదలైంది. 12 గంటల సమయానికి నాంపల్లి, బేగంబజార్‌, మెహిదీపట్నం, ఖైరతాబాద్‌ ప్రాంతాల్లో 5 సెంటీమీటర్ల వర్షం పడింది. అర్ధరాత్రి ఒంటిగంట సమయానికి మోండా మార్కెట్‌ ప్రాంతంలో గరిష్ఠంగా 10 సెంటీమీటర్ల వర్షం కురిసింది. దాదాపు వంద బస్తీలు ముంపులో చిక్కుకున్నట్టు తెలుస్తోంది. మంగళవారం, బుధవారం కురిసిన భారీ వర్షాలకు నీట మునిగిన కాలనీల ప్రజలు.. మళ్లీ వరద ఎక్కడ ముంచెత్తుతుందో అని ఆందోళనకు గురయ్యారు.

కుండపోత వానతో రాజ్‌భవన్‌ రహదారి పూర్తిగా నీట మునిగింది. ఎంఎస్‌ మక్తా ప్రాంతం వణికిపోయింది. ఆ ప్రాంతమంగా నీట మునిగింది. దాదాపు 200 ఇళ్లలోకి వరద నీరు చేరడంతో… జనం కట్టుబట్టలతో మిగిలిపోయారు. భారీ వర్షానికి ఎంఎస్‌ మక్తాలో ప్రహరీగోడ కూలిపోయింది. అయితే ఎవరికీ ఎలాంటి గాయాలు కాకపోవడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. కాగా… ఎంఎస్‌ మక్తా మునిగిపోయిందన్న సమాచారంతో జీహెచ్‌ఎంసీ అధికారులు వెంటనే అక్కడికి చేరుకున్నారు. కాలనీలో సహాయ చర్యలు చేపట్టారు. రెస్క్యూ ఆపరేషన్‌ను నగర మేయర్‌ బొంతు రామ్మోహన్‌ స్వయంగా పర్యవేక్షించారు.

ఎంఎస్‌ మక్తాలో 200 ఇళ్లలోకి వర్షపు నీరు చేరడంతో… జనం భయాందోళనకు గురయ్యారు. చిన్న పిల్లల్ని ఎత్తుకుని బిల్డింగ్‌లపైకి పరుగులు తీశారు. నిన్న రాత్రి నుంచి రోడ్లపైనే పడిగాపులు కాస్తున్నామని… కట్టుబట్టలతో మిగిలిపోయామని వాపోతున్నారు. ఏళ్ల తరబడిగా తమ పరిస్థితి ఇలాగే ఉందంటూ ఎంఎస్ మక్తా వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వర్షాలు కురిసినప్పుడు హడావుడి చేస్తున్న అధికారులు… తమ ప్రాంతానికి శాశ్వత పరిష్కారం చూపించడం లేదని మండిపడుతున్నారు.

భారీ వర్షంతో పంజాగుట్ట ప్రాంతంలో వరద నీరు రహదారులను ముంచెత్తడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. మెహిదీపట్నం రాజేంద్రనగర్‌ మార్గంలో కూడా కొద్దిసేపు రాకపోకలు నిలిచిపోయాయి. ఆరాంఘర్‌ చౌరస్తా నుంచి విమానాశ్రయం వరకూ వంతెన నిర్మాణ పనులు జరుగుతుండడంతో… ఆ మార్గంలో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. ఎల్‌బీనగర్‌ చుట్టుపక్కల ప్రాంతాల నుంచి వచ్చిన వరదతో బైరామల్‌గూడ, చింతలకుంట చెక్‌పోస్టు నీట మునిగాయి. కర్మన్‌ఘాట్‌, సాగర్‌ రింగ్‌రోడ్డు పరిసర కాలనీల ప్రజలు వరద ముప్పు ఉంటుందని ఆందోళన చెందుతున్నారు. అర్ధరాత్రి 2.45 గంటల సమయానికి కూడా ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తూనే ఉంది. పలుచోట్ల అపార్ట్‌మెంట్ల సెల్లార్‌లలోకి వర్షపు నీరు చేరింది.