ఒంటి గంటకే చీకటి: హైదరాబాద్ లో భారీ వర్షం

  • Publish Date - September 23, 2019 / 08:04 AM IST

హైదరాబాద్ సిటీలో పలుచోట్ల సోమవారం(23 సెప్టెంబర్ 2019) వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, మాదాపూర్, పంజాగుట్ట, ఖైరతాబాద్, కోఠి, ఉప్పల్, కూకట్ పల్లి ప్రాంతాల్లో వర్షం విపరీతంగా కురుస్తుంది.

మధ్యాహ్నం నుంచి పలు ప్రాంతాల్లో వర్షం చిన్నగా మొదలై.. సిటీ అంతటా దట్టమైన నల్ల మబ్బులు కమ్మేశాయి. గంట నుంచి వర్షం దంచికొట్టడంతో రోడ్లు జలమయం అయిపోయాయి. ప్రధాన మార్గాల్లో ట్రాఫిక్ జామ్ అవుతుంది. ఫలితంగా నగర ప్రజలకు ట్రాఫిక్ ఇబ్బందులు తప్పట్లేదు.

తెలంగాణలో మరో రెండు రోజుల పాటు ఓ మోస్తరు నుంచి భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ కూడా చెబుతుంది. వాతావరణం చల్లగా ఉండడంతో ఆహ్లాదకరంగా ఉన్నప్పటికీ పెద్ద పెద్ద హోర్డింగులు పడితే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే విషయంపై జీహెచ్ఎంసీ అధికారులు ఆలోచనలు చేస్తున్నారు.

ఆదివారం(22 సెప్టెంబర్ 2019) కూడా భారీగా వర్షం పడగా.. అమీర్ పేట్ లో మెట్రో కింద ఓ యువతి పెచ్చులు ఊడిపడి మరణించగా.. అటువంటి ఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు అధికారులు.