ఆర్టీసీ కార్మికులతో శనివారం ఉదయం చర్చలు జరపండి : ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం

  • Publish Date - October 18, 2019 / 10:47 AM IST

గత 14 రోజులుగా సమ్మె చేస్తున్న ఆర్టీసీ కార్మికులతో శనివారం ఉదయం పదిన్నర గంటలకు చర్చలు జరపాలని తెలంగాణ ప్రభుత్వాన్ని హైకోర్ట్ ఆదేశించింది. ఆర్టీసీ సమ్మెకు సంబంధించి శుక్రవారం, ఆక్టోబరు 18న హైకోర్టులో విచారణ  జరిగింది. ఈ సందర్భంగా గతంలో తాము చెప్పినట్టు ఆర్టీసీకి ఎండీని ఎందుకు నియమించలేదని హైకోర్టు ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. అయితే, ఎండీని నియమించడం వల్ల సమస్య పరిష్కారం కాదని, ఇప్పటికే సమర్థుడైన ఇన్‌చార్జి ఉన్నారని కోర్టుకు ప్రభుత్వం తరఫున న్యాయవాదులు వివరించారు. 

ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయకుంటే చర్చలే  లేవని యూనియన్లు పట్టుబడుతున్నాయని ప్రభుత్వం కోర్టుకు తెలిపింది. కార్మికులతో చర్చలకు సీనియర్ ఐఏఎస్ అధికారులతో కమిటీ వేశామని, కార్మికుల సమస్యల పరిష్కారానికి చిత్తశుద్ధితో ప్రయత్నించినట్లు ప్రభుత్వం చెబుతోంది. చర్చలు జరుగుతుండగానే కార్మిక సంఘాలు సమ్మెకు వెళ్లాయని, తెలంగాణ ఏర్పాటయ్యాక ఆర్టీసీ కార్మికులకు 67శాతం జీతాలు పెరిగాయని ప్రభుత్వం కోర్టుకు విన్నవించింది.రాష్ట్రం ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉందని ప్రభుత్వం తరఫు న్యాయవాది కోర్టుకు వివరించారు. ఇప్పుడు కార్మికులు పెట్టిన డిమాండ్స్ అన్నింటినీ తీర్చే పరిస్థితి లేదని హైకోర్టుకు తెలిపింది.

కాగా… అదే ఇన్‌చార్జి సమర్థుడైతే…అతడినే ఎండీగా నియమించవచ్చు కదా అని కోర్టు ప్రశ్నించింది. ఈ సందర్భంగా కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. రెండు వారాలుగా ఆర్టీసీ కార్మికులు సమ్మె జరుపుతుంటే ప్రభుత్వం ఏం చేస్తోంది? సమ్మెను ఎందుకు ఆపలేకపోతోంది? ఆర్టీసీ కార్మికులకు మరికొంత మంది మద్దతు తెలిపితే వారిని ఎవరూ ఆపలేరు. ప్రజాస్వామ్యంలో ప్రజలే శక్తివంతులు. ప్రజలు తిరగబడితే ఎవరూ ఆపలేరు. అని న్యాయమూర్తి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఆర్టీసీ సమ్మె నివారణపై ప్రభుత్వం తీసుకున్న చర్యలేంటి? ఆర్టీసీకి ఎండీని ఎందుకు నియమించలేదు? సమ్మె తీవ్రరూపం దాలుస్తోంది. సమ్మెకు పరిష్కారం చూపకపోతే మరింత ఇబ్బందికరమైన పరిస్థితులు తలెత్తవచ్చు.

ఆర్టీసీకి ఎండీని నియమించి ఉంటే కార్మికుల్లో నమ్మకం ఏర్పడేది. ఫిలిప్పీన్స్ లోనూ సమ్మెల వల్ల ఆ దేశ ఆర్థిక పరిస్థితి దిగజారింది. సమ్మె వల్ల ప్రజలు రెండు వారాలుగా ఇబ్బందులు పడుతున్నారు. ఎండీ నియామకం, హెచ్‌ఆర్ఏ పెంపు వంటి డిమాండ్లు న్యాయపరమైనవే. కార్మికులకు నమ్మకం కలిగేలా ప్రభుత్వ చర్యలుండాలి.’అని హైకోర్టు అభిప్రాయపడింది. అయితే, ఆర్టీసీ ఆర్థిక పరిస్థితి కారణంగానే ఎండీని నియమించలేదని అదనవు అడ్వకేట్ జనరల్ కోర్టుకు తెలిపారు. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశామని చెప్పారు. అయితే, ఏఏజీ వాదనలతో హైకోర్టు సంతృప్తి చెందలేదని తెలుస్తోంది.