ఖాకీ చొక్కాలకు కనికరం ఉండదు.. అహంకారంతో ఏదైనా చేస్తారు.. బాధలో ఉన్న వ్యక్తిని కూడా చాలా శులువుగా కాళ్లతో కొట్టేస్తారు. కూతురు ఆత్మహత్య చేసుకుంటే పుట్టెడు దు:ఖంలో మునిగిపోయిన తండ్రిని దారుణంగా కాలితో తన్నిన ఘటన తెలంగాణలోనే కాదు.. దేశవ్యాప్తంగా ప్రతి ఒక్కరిని కలచివేసింది. సంగారెడ్డి జిల్లా పఠాన్‌చెరు ఏరియా ఆస్పత్రి దగ్గర ఈ ఘటన చోటుచేసుకుంది. మహబూబ్‌నగర్ జిల్లా ఎనుగొండకు చెందిన చంద్రశేఖర్, పద్మ దంపతుల కుమార్తె సంధ్యారాణి 25 ఫిబ్రవరి 2020వ తేదీన నారాయణ జూనియర్ కాలేజీలో బాత్‌రూమ్‌లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది.
అయితే నారాయణ కాలేజ్ యాజమాన్యం కారణంగానే తమ కూతురు మరణించిందని సంధ్యారాణి తల్లిదండ్రులు ఆరోపణలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే పఠాన్‌చెరు ఏరియా ఆసుపత్రి ముందు మృతదేహంతో ధర్నాకు దిగారు తల్లిదండ్రులు. దీంతో ఆస్పత్రి ముందు ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు రంగంలోకి దిగారు. సర్దిచెప్పాల్సిన పోలీసులు సహనం కోల్పోయి మృతురాలి తండ్రిని బూటుకాలితో తన్నారు. బలవంతంగా మృతదేహాన్ని పోస్టుమార్టం గదికి తరలించారు. పోలీసుల తీరుపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ఈ క్రమంలోనే విద్యార్ధిని తండ్రిని కాలితో తన్నిన పోలీస్ కానిస్టేబుల్ శ్రీధర్ మీద ఉన్నతాధికారులు చర్యలు తీసుకున్నారు. కానిస్టేబుల్ శ్రీధర్‌ను సంగారెడ్డిలోని జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్స్‌కు అటాచ్ చేశారు. ఈ మేరకు ఎస్పీ చందన దీప్తి ఓ ప్రకటన విడుదల చేశారు. పటాన్ చేరు పోలీస్ స్టేషన్‌కు చెందిన కానిస్టేబుల్ శ్రీధర్ (పీసీ 349) మృతురాలి తండ్రిపై దురుసుగా ప్రవర్తించిన తీరు బాధాకరం అంటూ పోలీసులు ప్రకటన చేశారు.
పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున దీనిపై తీవ్రంగా చింతిస్తున్నాం. ఈ సంఘటనలో కానిస్టేబుల్ హెడ్ క్వార్టర్స్ సంగారెడ్డికి అటాచ్ చేస్తున్నట్లు చెప్పారు. వైరల్ అయిన వీడియోలను పూర్తిగా విశ్లేషించి పూర్తిస్థాయి విచారణ జరిపిన అనంతరం తదుపరి క్రమశిక్షణ చర్యలు తీసుకుంటాం.’ అని ప్రకటన చేశారు.