కామన్ టిక్కెట్: వేసవిలో మూడు పార్కులు తిరిగేయండి

  • Publish Date - April 18, 2019 / 05:30 AM IST

వేసవిలో హైదరాబాద్ మొత్తం షికారు కొట్టేయాలని అనుకుంటున్నారా? మీ కోసమే హైదరాబాద్‌ మహా నగరాభివృద్ధి సంస్థ(హెచ్‌ఎండీఏ) అధ్భుతమైన ఆఫర్ ఇచ్చేసింది. నెక్లెస్‌రోడ్డులోని మూడు పార్కుల్లో ఒకటే టిక్కెట్ తో ఎంట్రీ అయ్యేందుకు అవకాశం కల్పిస్తుంది హెచ్‌ఎండీఏ. హెచ్‌ఎండీఏకు చెందిన బుద్ధ పూర్ణిమ ప్రాజెక్టు అథారిటీ(బీపీపీఏ) నెక్లెస్‌రోడ్డులో నగరవాసులు ఆహ్లాదకరంగా గడిపేలా సంజీవయ్య, లుంబినీ పార్కులు, ఎన్టీఆర్‌ గార్డెన్స్‌ తదితరాలను అభివృద్ధి చేసింది. ఎగ్జిబిషన్లు, ఇతర సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణకు పీపుల్స్‌ ప్లాజా(నెక్లెస్‌రోడ్డు), ఐమ్యాక్స్‌ పక్కనే ఉన్న మైదానం, పార్టీ జోన్‌(ఎన్టీఆర్‌ గార్డెన్స్‌)లను అద్దెకు ఇస్తుంటుంది.

వేసవిలో వేరే ప్రదేశాల నుంచి వచ్చే పర్యాటకులు కూడా నెక్లెస్‌రోడ్డులో ఆహ్లాదంగా గడుపుతూ ఉంటారు. ఈ క్రమంలో హెచ్‌ఎండీఏ నెక్లెస్‌రోడ్డుకు వచ్చే పర్యాటకులు అందరూ అన్నీ పార్కుల్లోకి వెళ్లేందుకు ఈ కామన్ టిక్కెట్ ఉపయోగపడనుంది. ఈ టిక్కెట్లను కూడా హెచ్‌ఎండీఏ సంస్థ ఆన్ లైన్ లో పెట్టింది. అలాగే పీపుల్స్‌ ప్లాజా, హెచ్‌ఎండీఏ గ్రౌండ్‌(ఐమ్యాక్స్‌ థియేటర్‌ పక్కన), పార్టీ జోన్‌(ఎన్టీఆర్‌ గార్డెన్‌ దగ్గర)లలో సినిమా షూటింగులు, పార్కుల్లో వనభోజనాలు, ఆత్మీయ సమ్మేళనాల వంటి కార్యక్రమాల నిర్వహణకు కూడా అనుమతులు ఇకపై హెచ్‌ఎండీఏ ఆన్ లైన్ ద్వారా ఇవ్వనుంది.