రైట్ రైట్ : హైటెక్ సిటీ మెట్రోకు గ్రీన్ సిగ్నల్

  • Publish Date - March 16, 2019 / 02:53 AM IST

ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న అమీర్ పేట – హైటెక్ సిటీ మెట్రో రైలు ప్రయాణానికి గ్రీన్ సిగ్నల్ వచ్చింది. సర్వీసులు ప్రారంభించటమే ఇక మిగిలింది. రైళ్లు నడిపేందుకు CMRS అనుమతి లభించిందని.. మెట్రో రైలు ఎండీ ఎన్వీఎస్ రెడ్డి ధృవీకరించారు. అనుమతులు రావడంతో అతి త్వరలోనే రైలు రయ్యి రయ్యి మంటూ దూసుకెళ్లనున్నాయి. 

హైదరాబాద్ మెట్రో రైల్ ప్రాజెక్టుల్లో భాగంగా.. ఇప్పటికే కొన్ని కొన్ని రూట్లలో సర్వీసులు నడుస్తున్నాయి. లక్షలాది మంది ప్రయాణీకులు ఈ సౌకర్యాన్ని ఉపయోగించుకుంటున్నారు. కీలకంగా ఉన్న అమీర్ పేట – హైటెక్ సిటీ మార్గంలో మెట్రో నడపాలని నిర్ణయించి పనులు మొదలు పెట్టారు. మొత్తం 10 కిలోమీటర్ల దూరం. 2018 నవంబర్‌లోనే పనులు పూర్తయ్యాయి. 4 నెలలుగా ట్రయల్ రన్స్ నిర్వహించారు అధికారులు.

CMRS బృందం 2019 ఫిబ్రవరి నెలలో తనిఖీలు నిర్వహించి వెళ్లింది. ట్రయల్ రన్ పై సంతృప్తి వ్యక్తం చేసిన అధికారులు.. అన్ని అనుమతులు ఇచ్చారు. మాదాపూర్, హైటెక్ సిటీ, జూబ్లిహిల్స్, బంజారాహిల్స్ ప్రాంతాల్లోని సాఫ్ట్ వేర్ కంపెనీలు, ఇతర సంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు ఎంతో సౌకర్యంగా ఉండనుంది. ప్రారంభించే తేదీ ఎప్పుడు అనేది త్వరలోనే ప్రకటించనుంది మెట్రో.

8 స్టేషన్లు
అమీర్ పేట – హైటెక్ సిటీ మార్గంలో మొత్తం 8 స్టేషన్లున్నాయి. – మధురానగర్ – యూసుఫ్ గూడ – జూబ్లిహిల్స్ చెక్ పోస్టు – పెద్దమ్మ గుడి – మాదాపూర్ దుర్గం చెరువు – హైటెక్ సిటీ.