రాజ్ భవన్ లో ఎట్ హోం:  హాజరైన కేసీఆర్,పవన్ కళ్యాణ్

  • Publish Date - January 26, 2019 / 02:25 PM IST

హైదరాబాద్: గణతంత్ర దినోత్సవం సందర్భంగా శనివారం సాయంత్రం గవర్నర్ నరసింహన్ ఇచ్చిన తేనీటి విందులో ఆసక్తికరమైన సంఘటన చోటు చేసుకున్నాయి…  ఇరు రాష్ట్రాల రాజకీయ నేతలకు రాజ్ భవన్ వేదికైంది… అన్ని రాజకీయ పార్టీల నేతలు తమ అభిప్రాయభేదాలను పక్క పెట్టి కాసేపు ముచ్చటించుకున్నారు… ఈ తేనీటి విందుకు సాంప్రదాయ దుస్తులతో వచ్చినటువంటి పవన్ కళ్యాణ్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.
గవర్నర్ ఇచ్చిన ఎట్ హోం కార్యక్రమంలో సీఎం కేసీఆర్, మాజీ గవర్నర్ రోశయ్య, హోం మంత్రి మహమ్మద్ అలీ ప్రతిపక్ష నేత మల్లు భట్టివిక్రమార్క, కాంగ్రెస్ అధ్యక్షుడు ఉత్తంకుమార్ రెడ్డి,  ఆంధ్ర ప్రదేశ్ డిప్యూటీ సీఎం కే ఈ కృష్ణమూర్తి మంత్రి పితాని సత్యనారాయణ. జనసేన అధినేత పవన్ కళ్యాణ్, టీ టీడీపీ అధ్యక్షుడు ఎల్ రమణ, సిపిఐ కార్యదర్శి చడా వెంకట రెడ్డి,హాజరైనారు.
పవన్ కళ్యాణ్ స్పెషల్ ఎట్రాక్షన్ 
ఈ తేనేటి విందుకి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సాంప్రదాయ దుస్తుల్లో వచ్చి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. కేటీఆర్ ను ఆలింగనం చేసుకుని, వారిద్దరూ పక్క, పక్కనే కూర్చొని చర్చించడం ఇతర రాజకీయ నేతలు ఆసక్తిగా గమనించారు. అనంతరం పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి ప్రక్కన కూర్చొని 15 నిమిషాలకు పైగా ముచ్చటించారు. కెసిఆర్, చంద్రబాబుకు రిటర్న్ గిఫ్ట్ ఇస్తున్న నేపథ్యంలో వీరి కలయిక చర్చనీయాంశమైంది. పవన్ కళ్యాణ్ వెళుతున్న సమయంలో గవర్నర్ ప్రత్యేకంగా ఆయనతో చర్చించారు.
కేసీఆర్, గవర్నర్ ప్రత్యేక చర్చలు 
తేనీటి విందు అనంతరం గవర్నర్ తో సీఎం కేసీఆర్ ప్రత్యేకంగా సమావేశమయ్యారు.. ఈ భేటీ దాదాపుగా గంటకు పైగా జరిగింది.. పార్లమెంటు ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో…  తాజా రాజకీయ పరిణామాలు, సహస్రచండీ యాగం… రాష్ట్రంలో నెలకొన్న తాజా పరిస్థితులు చర్చకు వచ్చినట్లు సమాచారం.. మరో పది రోజుల్లో క్యాబినెట్ విస్తరణ ఉంటుంది అని వార్తలు వస్తున్న నేపథ్యంలో వీరి సుదీర్ఘ భేటీ మరింత ప్రాధాన్యత సంతరించుకుంది.